రాష్ట్రంలో తమ పార్టీకి ఆదరణ లేకపోయినా, సీట్ల కోసం ఆశించకుండా ప్రజల కోసం చాలా చేశామంటూ ఇవాళ్లే భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా రాష్ట్రం కోసం ఆలోచించే ఏకైక పార్టీ తమదే అని చాలా గొప్పగా చాటిచెప్పారు. మరి, ఇదే రోజున అదే పార్టీ నుంచి వెలువడిన ఈ ప్రకటనను ఏమనాలి..? ఆంధ్రప్రదేశ్ కు రెండో రాజధాని రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది రాష్ట్ర భాజపా. కర్నూలులో భాజపా నేతల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి, కార్యవర్గ సభ్యురాలు శాంతా రెడ్డి ఈ మేరకు డిమాండ్ చేశారు.
రాయలసీమలో అసెంబ్లీ భవనం నిర్మించీ ఇక్కడ కూడా మహారాష్ట్ర, కర్నాటక తరహాల్లో సమావేశాలు నిర్వహించాలన్నారు. వీటితోపాటు సెక్రటేరియట్, గవర్నర్ తాత్కాలిక నివాసం, ముఖ్యమంత్రి నివాసం.. ఇవి కూడా సీమలోనే పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేనా.. ప్రస్తుతం ఏపీ సర్కారు ఏర్పాటు చేయాలనుకుంటున్న తాత్కాలిక హైకోర్టును కూడా సీమలోనే పెట్టాలట! ఇక్కడితో ఆగినా బాగుండేది..! రాయలసీమ జిల్లాల సంఖ్యను 4 నుంచి 8కి పెంచాలట. ఎందుకంటే, పరిపాలనా సౌలభ్యం కోసమట. బడ్జెట్ లో ప్రత్యేక నిధి కింద రాయలసీమకు రూ. 20 వేల కోట్లు కేటాయించాలనీ, సీమలోని ప్రాజెక్టులను 2019లోగా పూర్తి చేయాలనీ, రాయలసీమ ప్రాంత నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని ఉన్నత స్థాయి కమిటీతో దర్యాప్తు చేయించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
భాజపా విభజన రాజకీయం కాకపోతే దీన్నేమంటారు..? 13 జిల్లాలున్న నవ్యాంధ్రకు రెండో రాజధాని అవసరమా..? ఉన్న రాజధానికే నిధులిచ్చిన దిక్కులేదు, కానీ రెండోది కావాలట. సరే, అవిభక్త ఆంధ్రాకు రెండింతలున్న ఉత్తరప్రదేశ్ కి రెండు రాజధానులు అవసరం లేదా..? అక్కడ వారే అధికారంలో ఉన్నారుగా, అనుకున్న వెంటనే ప్రకటన చేయగలరు కదా. కానీ, అక్కడ ఇలా మాట్లాడలేరు! ఆంధ్రాలో వారికి ఏబలమూ లేదు కాబట్టి, ఇలాంటి విభజన రాజకీయాలు ఎన్నైనా చేస్తున్నారు. సీమ ప్రాంత ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టి చిచ్చుపెట్టడానికి తప్ప, ఈ డిమాండ్ల వెనక భాజపాకు ఉన్న రాష్ట్రాభివృద్ధి కాంక్ష ఎక్కడైనా కనిపిస్తోందా చెప్పండీ..! ప్రాంతాలవారీగా జిల్లాలవారీగా రాష్ట్రంలో అనిశ్చితి క్రియేట్ చేయడం రావడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబును, టీడీపీ సర్కారును ఇరకాటంలో పడేసే ఉద్దేశంలో భాజపా ఉందన్నది చాలా స్పష్టం. నిజానికి, ఏపీలో చంద్రబాబును ఈ తరుణంలో సమర్థంగా ఎదుర్కోవాలంటే ఇలాంటి విచ్ఛిన్న వ్యూహాన్ని అనుసరించాలనే నిర్ణయం భాజపా తీసుకుందనే కథనాలు కూడా ఓ మూడు రోజుల కిందట వినిపించాయి. వాటికి బలం చేకూర్చే డిమాండ్లే ఇవి..! సోము వీర్రాజు గొంతు చించుకున్నట్టుగా రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఏపీ కోసం భాజపా ఇప్పుడు చేస్తున్నదేంటీ..?