హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ద్విసభ్యకమిటీ ఇవాళ హైదరాబాద్ వచ్చి విచారణ ప్రారంభించింది. సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో ఈ ఘటనకు సంబంధించిన వివిధ వర్గాలను పిలిచి విచారిస్తున్నారు. అయితే కమిటీలో దళితుడు లేరని, దళితుడు ఒక్కరైనా లేకపోతే తమకు న్యాయం జరగదని విద్యార్థులు వాదిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటనపై స్పందించారు. దళిత విద్యార్థి ఆత్మహత్యపై ప్రధాని నరేంద్ర మోడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అది ఆత్మహత్య కాదని, ప్రజాస్వామ్యను, సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని హత్యచేయటమేనని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రులు దత్తాత్రేయను, స్మృతి ఇరానిని క్యాబినెట్నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా ఈ ఘటనపై స్పందించారు. తమ పార్టీ సీనియర్ సభ్యులను ఇద్దరిని సెంట్రల్ వర్సిటీకి పంపారు. అటు సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థుల వద్దకు వివిధ పార్టీల నాయకులు వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు వి.హనుమంతరావు, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, టీఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఇవాళ యూనివర్సిటీకి వచ్చి వెళ్ళారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి రోహిత్ తల్లికి ఫోన్ చేసి పరామర్శించారు.