ఏదైనా చేసి వార్తల్లో ఉండేవారు కొందరైతే… వార్తల్లో ఉండటం కోసం ఏదో ఒకటి చేసేవాళ్లు మరికొందరు..! ఈ రెండో కోవకు చెందినవారిలో కత్తి మహేష్ ఒకరు. ఆ మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని చాలా ట్వీటారు. ఇప్పుడు, ఏకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ట్వీట్స్ పెట్టే స్థాయికి ఆయన ఎ‘దిగి’పోయారు. ‘ఎంవోయూలకీ అగ్రిమెంట్లకీ చాలా తేడా ఉంది చంద్రబాబు గారు..! ఎందుకు ఇంకా మోసాలు. ఇప్పటివరకూ అయిన ఎంవోయూల పరిస్థితి చెప్పండి’ అంటూ తాజాగా ఓ ట్వీట్ చేశారు. అక్కడితో ట్వీట తీరలేదేమో.. ‘అప్పులు సంపాదించగలగటమే అభివృద్ధికి మెగా ఇండికేటర్ అని చంద్రబాబు చెప్పడం. మనం నమ్మడం. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు. మన భవిష్యత్తు లోకేష్ పాలు. ఇదే కమ్మోళ్లకు, తెలుగుదేశం పార్టీకి కావలసింది’ అంటూ మరో ట్వీటు, ఇంకాస్త దిగజారి కులాన్ని ప్రస్థావిస్తూ… ‘కమ్మోళ్లకు తప్ప మరే కులపొళ్ళకూ చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఎందుకు కనపడదు చెప్మా!’ అంటూ ఓ నిట్టూర్పు..!
కత్తికి తెలియని ప్రాసెస్ ఏంటంటే… ఎవ్వోయులు అంటే మనకు మూడొచ్చినప్పుడు రాసే ట్వీట్లంత సులువుగా ఉండవు! ఒక పరిశ్రమ ఏర్పాటుకు ముందు జరిగే మొదటి పనే ఎం.వొ.యు. ఆ తరువాత, ఏం జరుగుతుందో… ఏపీ సర్కారు కుదుర్చుకున్న ఎం.వొ.యు.ల విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఒక్కసారి www.apindustries.gov.in చూస్తే అర్థమౌతుంది. ఇన్వెస్ట్ మెంట్ ట్రాకర్ అంతా అందులో ఉంటుంది. ఒక ఎం.వొ.యు. కార్యరూపం దాల్చాలంటే.. సినిమా చూసిన వెంటనే రివ్యూ రాసినంత సులువు కాదు, సినిమా తీయడానికి ఉండే పనికంటే చాలా ఉంటుంది..! ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలన్నీ వెంటనే గ్రౌండింగ్ కావు. కొంత టైం పడుతుంది. మౌలిక సౌకర్యాల కల్పన అనేది ఒకటి ఉంటుంది. రోడ్లు, నీరు, కరెంటు, ఇతర అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిలో కూడా ఎలాంటి జాప్యం చెయ్యకుండా ఏపీ ప్రభుత్వం ఎంత చురుగ్గా పనిచేస్తోందనడానికి ఉదాహరణే కియా మోటార్స్ పనుల ప్రారంభం..!
ఇక, ఆంధ్రప్రదేశ్ అప్పులపాలు అంటూ కత్తి ఓ నిట్టూర్పు ట్వీట్ చేశారు. ప్రభుత్వాలు అప్పులు చేయడం అత్యంత సహజమైన విషయం అని ఆయనకు తెలియకపోవచ్చు. ప్రతీ రాష్ట్రానికీ అప్పులు ఉన్నాయి. ఒకప్పుడు, ఆంధ్రాను ప్రపంచబ్యాంకుకి చంద్రబాబు తాకట్టుపెట్టేశారని చాలా విమర్శలే వచ్చాయి. కానీ, తరువాత అభివృద్ధి ఆగిందా..? ఇక, కులం గురించి కూడా కత్తి ఓ ట్వీటు పెట్టారు. కయ్యానికి కాలు దువ్వడం తప్ప.. దీని ప్రయోజనం మరొకటి కనిపించడం లేదు. పవన్ వివాదం శాంతించిన తరువాత కత్తి ఖాళీగా ఉంటున్నారేమో… ఇప్పుడు మరోసారి కావాలని వివాదాస్పద ట్వీట్లు పెడుతున్నారు.