సెట్లో చిన్న చిన్న ప్రమాదాలు జరగడం మామూలే. శ్రీదేవికీ అలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి. రెండుసార్లూ.. కార్లు ఆమెను ఢీ కొట్టుకున్నాయి. అయితే అదృష్టవశాత్తూ పెద్దగా గాయాలేం లేకుండానే బయటపడింది. ఓసారైతే స్వయంగా ఎన్టీఆర్ కారు నడుపుతూ.. శ్రీదేవిని గుద్దేశారు. ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్ కారు నడుపుకుంటూ వచ్చి, శ్రీదేవి ముందు ఆగాలి. అయితే ఆ సమయంలో కారు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో… ఆ కారు శ్రీదేవిని గుద్దేసింది. ఆ సమయానికి డ్రైవింగ్ సీట్లో ఉన్నది ఎన్టీఆరే. కాకపోతే.. కారు స్లోగా నడపడం వల్ల ప్రమాదమేం జరగలేదు. మరో ఘనట.. శ్రీదేవి బాలనటిగా ఉన్నప్పుడు జరిగింది. శోభన్ బాబు నటించిన `నా తమ్ముడు` చిత్రానికి కె.ఎస్. ప్రకాశ రావు దర్శకుడు. చెన్నైలోని మౌంట్ రోడ్డుపై ఓ సన్నివేశాన్ని చిత్రీకరించాల్సివచ్చింది. రోడ్డుపైనుంచి శ్రీదేవి దాటుకుంటూ రావాలి. ఆ సన్నివేశాన్ని ఆ చిత్రానికి సహాయకుడిగా పనిచేస్తున్న రాఘవేంద్రరావు పర్యవేక్షిస్తున్నారు. రోడ్డుని శ్రీదేవి దాటుతున్న సమయంలో ఎక్కడి నుంచో ఓ కారు వచ్చి.. శ్రీదేవిని గుద్దేసింది. ఆ వెంటనే రాఘవేంద్రరావు పరుగు పరుగున వచ్చి, శ్రీదేవిని ఎత్తుకుని పక్కనే ఉన్న ఇంట్లోకి తీసుకెళ్లి సపర్యలు చేశారు. అలా రెండు సార్లు కారు ప్రమాదాల నుంచి తప్పుకుంది శ్రీదేవి.