తెలుగులో శ్రీదేవి ఎన్నో హిట్ సినిమాలు చేసింది. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబుల నుంచి చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలతో నటించింది. శ్రీదేవి చేయని పాత్ర లేదు. చేయని సినిమా లేదు. అయితే ఈతరం ప్రేక్షకులకు ప్రేక్షకులకు శ్రీదేవి పేరు వింటే గుర్తొచ్చే సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. అందులో హీరో చిరంజీవి. తెలుగులో శ్రీదేవి కథానాయికగా నటించిన చివరి సినిమా ‘ఎస్.పి. పరశురామ్’. అందులో హీరో కూడా చిరూనే కావడం విశేషం. ‘ఎస్.పి. పరశురామ్’ తర్వాత శ్రీదేవి తెలుగులో సినిమాలు చేయలేదు.
ప్రేక్షకులకు పెద్దగా తెలియని విషయం ఒకటి వుంది. చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అక్క శ్రీలతతో కలిసి శ్రీదేవి ఒక సినిమా నిర్మించాలని సంకల్పించింది. ఆ సినిమా పేరు ‘వజ్రాలదొంగ’. కథ సిద్ధమైంది. చిరు డేట్స్ ఇచ్చాడు. తమిళ హీరో, తమిళనాడు మాజీ సీయం ఎంజీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ‘వజ్రాలదొంగ’ సినిమా అనివార్య కారణాల వల్ల మధ్యలో ఆగింది. దాంతో ప్రేక్షకులకు శ్రీదేవిని నిర్మాతగా చూసే అవకాశం దక్కలేదు.