ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా పరిస్థితి చక్కదిద్దేందుకు వెంకయ్య నాయుడు రంగంలోకి దిగేవారు. కానీ, ఆయన కేంద్రమంత్రి బాధ్యతల నుంచి తప్పుకుని, ఉపరాష్ట్రపతి అయిన తరువాత ఆ పెద్దన్న పాత్రను పోషించే అవకాశం కొంత తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రోజురోజుకీ గ్యాప్ పెరుగుతోంది. టీడీపీ, భాజపాల మధ్య పొత్తు తెగతెంపులు వరకూ వెళ్తుందేమో అనే వాతావరణమే ఇప్పుడు నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల విషయమై తన వంతు సహకారం చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో వెంకయ్య చెప్పడం విశేషం..!
సీఐఐ సదస్సుకు విశాఖ వచ్చిన ఉపరాష్ట్రపతి తన కుమారుడి ఇంట్లో బస చేశారు. అక్కడికి సీఎం చంద్రబాబు వెళ్లి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా కేంద్ర సాయానికి సంబంధించిన అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిమెలిసి ఉండాలనీ, సమస్యల్ని కూర్చుని పరిష్కరించుకోవాలని చంద్రబాబుకు వెంకయ్య సూచించారు. ఆంధ్రాకు ఇచ్చిన హామీలను నెరవేర్చితే కేంద్రంతో కలిసి పనిచేయడానికి తమకు అభ్యంతరం ఏముంటుందని చంద్రబాబు అన్నారట. ఏపీ సమస్యల విషయమై తాను చొరవ తీసుకుంటానని ఈ సందర్భంగా వెంకయ్య హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే, కాస్త ఆలస్యంగా వెంకయ్య ఈ ప్రయత్నం మొదలుపెట్టారా అని అనిపిస్తోంది..! ఎందుకంటే, టీడీపీ భాజపాల మధ్య వాతావరణం చాలా వేడెక్కిపోయింది. సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసేందుకు ఏపీ భాజపా నేతలు తగ్గడం లేదు. పొత్తు తెంచేసుకుందామనే ధోరణే జాతీయ నాయకత్వంలో కనిపిస్తోంది. నిజానికి, తొలివిడత బడ్జెట్ సమావేశాల తరువాత కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, అమిత్ షాలతో వెంకయ్య భేటీ అయ్యారు. ఆ చొరవ వల్లనే ఆంధ్రా విషయమై కేంద్రం కాస్త దిగొచ్చినట్టు కనిపించింది. కానీ, చేస్తున్నాం చూస్తున్నామని అన్నారే తప్ప… ఇంతవరకూ కార్యరూపంలో ఏదీ కనిపించలేదు..! ప్రస్తుతం టీడీపీ, భాజపాల మధ్య ఉన్న ఘర్షణాత్మక వాతావరణంలో మరోసారి వెంకయ్య జోక్యం చేసుకుని, వ్యవహారం చక్కదిద్దితే మంచిదే. ఏపీకి సానుకూలంగా కేంద్రంతో ప్రకటనలు చేయించగలిగితే సంతోషమే.
కానీ, రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తున్నప్పుడు… భాజపా వైఖరి మరోలా కనిపిస్తోంది. ఏపీ విషయంలో రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత పెరిగిపోయింది. నిజానికి, ఏపీ భాజపా, టీడీపీ నేతల మధ్య మాటలు యుద్ధం ముదరక ముందే వెంకయ్య స్పందించి ఉంటే కొంత ప్రయోజనం ఉండేదేమో..! ఇప్పుడు వెంకయ్య చొరవ తీసుకుని నాయకులతో మరోసారి భేటీ అయినా.. ఇలాంటి సందర్భంలో వారు వెంకయ్య చెప్పినట్టు వింటారా అనే అనుమానం కూడా కొంత ఉంది. అలాగని, వెంకయ్య చేయబోయే ప్రయత్నాలు ఫలించవనీ చెప్పలేం. ఆయన ఇంకాస్త ముందు స్పందించి ఉంటే.. ఫలితాల మరింత మెరుగ్గా ఉండేవేమో.