శ్రీదేవి వెళ్ళిపోయింది. ఆమె ఇంక కనిపించదనే వాస్తవం జీర్ణం కావడం లేదు. పుట్టుక-చావు అనివార్యం. అయితే శ్రీదేవి ఆకస్మిక మరణం అభిమానులను కలచివేసింది. యావత్ దేశం ఆమెకు నివాళి అర్పిస్తుంది. ఎంత గొప్ప స్టార్ ఆవిడ?! 54 ఏళ్ల జీవితంలో యాబై ఏళ్ళుసినిమాతోనే మమేకమైయింది. ఆమె ఓ దేవకన్య లాంటి మనిషిని కాదు. గ్రేట్ ఆర్టిస్ట్. ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసేయగల ప్రతిభ వున్న హీరోయిన్. నిజంగా అలాంటి హీరోయిన్ మళ్ళీ సినిమా పరిశ్రమకు దొరుకుతుందా ? అంటే ఖచ్చితంగా దొరకదనే సమాధానమే వస్తుంది. బేసిగ్గా హీరోయిన్స్ స్టార్ టైమ్ తక్కువ. ఒక దశాబ్దం నిలదొక్కుకుంటే అదో చరిత్ర. కాని శ్రీదేవిది మరో చరిత్ర. మూడు తరాల కధానాయకులకు కధానాయికి శ్రీదేవి. నాలుగు దశాబ్దాల హీరోయిన్. ఇలాంటి ఘనత వేరొకరికి సాధ్యమా?!. అందుకే శ్రీదేవి ఇక లేదనే నిజం అభిమానులకు నమ్మాలనిపించడం లేదు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోట్ల సంఖ్యలో పోస్టులు, సందేశాలు. మరి శ్రీదేవి ఆత్మకు శాంతి కలుగుతుందా ?! అంటే ఖచ్చితంగా కలగదు! ఒక నటిగా ఆమె ఆత్మకు శాంతి ఉటుందేమో కానీ ఒక తల్లిగా మాత్రం ఆమె ఆత్మకు శాంతి వుండదు.
అభిమానులకు, ప్రేక్షకులకు శ్రీదేవి ఒక అప్సరస. దేవకన్య. అతిలోక సుందరి. కానీ శ్రీదేవి తనకు తాను ఒక తల్లిగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడింది. కోట్లు ఇస్తామని సినీ రూపకర్తలు రెడీగా వున్నా..”పిల్లలు, ఇల్లే నాకు ముఖ్యమని” చెప్పిన సూపర్ స్టార్ శ్రీదేవి. మిగతా హీరోయిన్స్ శ్రీదేవికి ఇదే తేడా. ఆకాశమంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ ఏనాడూ హద్దులు దాటలేదు శ్రీదేవి.
శ్రీదేవి చాలా ఫ్యామిలీ టైపు. ఒకసారి దర్శకుడు రామ్ గోపాల్ వర్మను, మీ ట్యాలెంట్ తో శ్రీదేవిని ఫ్లాట్ చేయలేకపోయారా ? అని అడిగితే, దానికి వర్మ ఇచ్చిన సమాధానం.. ”నేనే కాదు. ఆమె దగ్గర ఎవరి పప్పులూ ఉడకవ్. ఆమెకు సినిమా, కుటుంబం తప్పితే వేరే తెలియదు. మన ట్యాలెంట్ ప్రదర్శించే అవకాశం కూడా ఇవ్వదు. నేను ఎదో చెప్పి ఇంప్రస్ చేయాలని అనుకుంటే.. చిన్న నవ్వుతో.. ‘నీ కంటిగులు ఇక ఆపే”అని సిగ్నల్స్ వస్తాయి. మరోదారి లేక నోరు మాసుకోవాల్సివస్తుంది. నేను ”ఫెడ్రిక్ నీసే ” అని ఎదో చెప్పబోతే.. ఫెడ్రిక్ నీసే అంటే అదేదో పురుగో, దోమో అని ఆమె ఫీలింగ్. ప్రపంచ విషయాలు ఆమెకు అసలు పట్టవ్. తన జీవితంపై తనకు ఫుల్ క్లారిటీ. తన చుట్టూ పెద్దగోడ కట్టుకుంది శ్రీదేవి. ఆ గోడను దాటి ఎవ్వడూ లోపలకి వెళ్ళలేడు. సినిమాల్లో రాక ముందు ఆమె అందం, నటన చూసి ముగ్ధుడైపోయేవాడిని. ఆమెతో సినిమాలు చేసిన తర్వాత ఆమె డిగ్నిటీ చూసి ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయా” అని శ్రీదేవి వ్యక్తిత్వం గురించి చెప్పాడు వర్మ.
వర్మ చెప్పింది నిజమే. శ్రీదేవిది విలక్షణమైన వ్యక్తిత్వం. ఆమెలా హుందాగా వుండటం చాలా తక్కువ మందికి సాధ్యపడుతుంది. సినిమా, లేకపోతే కుటుంబం.. ఇంతే తెలుసు ఆమెకు. సినిమా కెరీర్ లో శ్రీదేవి తల్లి ఆమెకు ఒక రక్షణ కవచంలా నిలబడిపోయింది. తల్లిపోయినపుడు చాలా డిస్టర్బ్ అయిపోయింది శ్రీదేవి. చాలా రోజులు నిరుత్సాహంగా గడిపింది. బోనీ కపూర్ ని పెళ్లాడడానికి ఒక విధంగా శ్రీదేవి తల్లే కారణం. ‘మా అమ్మాయికి బోణి లాంటి కుర్రాడు అయితే బావుండేది” అని తన మనసులో మాట బయటపెట్టింది శ్రీదేవి తల్లి ఒక సందర్భంలో. అప్పటికే శ్రీదేవి అంటే బోనికి ఘాడమైన ప్రేమ. ఆమె కోసమే సినిమాలు నిర్మించాడు బోని. తన తల్లికోరిక కూడా బోనినే కదా అని బోని కన్సిడర్ చేసింది శ్రీదేవి. శ్రీదేవి తల్లికి అనారోగ్యం చేస్తే బోనినే దగ్గర వుండి అంతా చూసుకున్నాడు. ఆ సమయంలో మరింత దగ్గర అయ్యారు. బోనీ కేరింగ్ ఆమెను ఇంప్రస్ చేసింది. సహజంగా ఫ్యామిలీకి చాలా ప్రాధన్యత ఇచ్చే శ్రీదేవి, బోని ఫ్యామిలీ కేరింగ్ కే ఫ్లాట్ అయ్యింది తప్పితే మరో ఆకర్షణ కాదు.
శ్రీదేవి ఫ్యామిలీకి ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో పెళ్లి తర్వాత ఇంకా బాగా తెలుస్తుంది. ఎలా అయితే బోనిని వివాహం చేసుకుందో అప్పటి నుండి మళ్ళీ మేకప్ వేసుకోలేదు శ్రీదేవి. ఆమెను దేవతా ఆరాధించే అభిమానులు, ప్రేక్షకులు ఉన్నప్పటికీ మళ్ళీ ఇటువైపు చూడలేదు. బోని, పిల్లలు, ఇల్లు ఇదే తన ప్రపంచం. శ్రీదేవిని దగ్గరగా చూసిన సన్నిహితులు ఆమెలో నటిని కంటే ఒక తల్లికి ఎక్కువ మార్కులు వేస్తారు. పిల్లల పట్ల ఆమెకు అపారమైన ప్రేమ. వెండితెరపై అప్సరసలా వెలిగిపోయిన శ్రీదేవి.. తన కుటుంబం కోసం నాలుగు గోడల మధ్య పిల్లల్ని చూసుకొని మాతృత్వ మాధుర్యాన్ని అనుభవించింది. మీరు జీవితంలో ఎప్పుడు ఆనందంగా వున్నారు అనే ప్రశ్నకు ..మరో ఆలోచన లేకుండా ” జాన్వీ, ఖుషిలు పుట్టినప్పుడు’ అని సమాధానం ఇచ్చేది శ్రీదేవి. ”వాళ్ళ కంటే నాకు ఏది ఎక్కువ కాదండి. నటిగా ఎదో చేశాను. మెచ్చుకున్నారు. కానీ నా పిల్లలు వచ్చినప్పుడే నా జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చింది”అని చెప్పేది శ్రీదేవి.
మళ్ళీ సెకెండ్ ఇన్నింగ్ ప్రారంభించింది శ్రీదేవి. అదెప్పుడు.. పిల్లలు పెరిగిపెద్దయ్యాక, ఇక వాళ్ళ పనులు వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారన్నతర్వాతే. ఈ సెకండ్ ఇన్నింగ్ కూడా శ్రీదేవికి పెద్దగా ఇష్టం లేదని కొందరు సన్నిహితులు చెబుతారు. పిల్లల్ని వదిలి మళ్ళీ ఈ షూటింగులు ఎందుకు అని తన సన్నిహితులతో ఆమె చెప్పుకునేవారు. అయితే పిల్లలు కూడా బలవంతం చేశారు. ”నిన్ను మళ్ళీ శ్రీదేవిగా చూడాలని వుంది మమ్మీ” అని అడిగివారట. ఒకసారి ‘ఐఫా’ వేడుకల్లో శ్రీదేవి లైవ్ లో డ్యాన్స్ ఫెర్ఫారమ్ చేసింది. దీనికి కారణం కూడా పిల్లలే. ”నీ గ్రేస్ ని లైవ్ లో చూడాలని వుంది మమ్మీ. ఆ చప్పట్లు లైవ్ వినాలని వుంది’ అని జాన్వీ, ఖుషి పట్టుబట్టారట. దీంతో వారం రోజులు ప్రాక్టీస్ కి వెళ్లి లైవ్ లో ఆదరగోట్టేసింది శ్రీదేవి. ప్రేక్షకుల అభినందనలు ఏమో కానీ జాన్వీ, ఖుషిల సంతోషం చూసి ఎంతో సంబరపడిపోయింది శ్రీదేవి.
కుటుంబంను ఎలా చక్కదిద్దుకోవాలో అన్నదానికి కూడా శ్రీదేవి మంచి ఆదర్శం. శ్రీదేవి ఒక పెద్ద సినిమా స్టార్ కంటే ముందు ఒక మహిళ. మహిళగా తన బాధ్యతలు ఏంటో తనకు బాగా తెలుసు. ఎవరెస్ట్ లాంటి స్టార్ డమ్ వునప్పటికీ ఏనాడూ ఆ అహంకారం ప్రదర్శించని స్టార్ శ్రీదేవి. కుటుంబం విషయంలోనూ ఇంతే. బోనికి రెండో భార్యగా శ్రీదేవి వెళ్ళడం ఏమిటని అంతా షాక్ అయిపోయారు. అయితే శ్రీదేవికి తన పరిస్థితులు తెలుసు. వాస్తవంలో బ్రతకాలని భావించింది. విధి రాతని నమ్మింది. ఇక తన జీవితం బోనితోనే అని డిసైడ్ అయ్యింది.
ప్రతి కాపురంలో కలతలు వుంటాయి. శ్రీదేవి కాపురంలో కూడా అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. మంచి ఫామ్ లో వున్నప్పుడు శ్రీదేవిని పెళ్లి చేసుకున్న బోని.. తర్వాత కొన్ని సినిమాలు నిర్మించి నష్టాలపాలయ్యాడు. ఆర్ధిక సమస్యలు చుట్టూముట్టాయి. దీంతో కాపురంలో కూడా కొన్ని కలహాలు. అయితే ఇక్కడే శ్రీదేవి, బోనికి ఒక పెద్ద అండగా నిలబడింది. తన సంపాధించిన ఆస్తులు కరిగిపోయిన పట్టించుకోలేదు. ఎన్నో సర్దుబాట్లు చేసి మళ్ళీ కుటుంబాన్ని చక్కదిద్దుకుంది. అంతే తప్పితే.. ఏనాడూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు. తను పెద్ద స్టార్ ని కదా, ఇలాంటి తలనొప్పులు నాకెందకు అనుకోలేదు. భార్య భర్తకు అండగా వుండాలి. ఇదే ధర్మమని భావించి పాటించింది. తన కాపురంపై ఎన్నో వార్తలు, గాసిప్పులు వచ్చినా.. ఒక్క రోజు కూడా సహనం కోల్పోలేదు శ్రీదేవి. చాలా హుందాగా వ్యవహరించింది.
ఇక తల్లి అయిన తర్వాత తన ప్రపంచమే మారిపోయింది. ”ఒక మహిళకు ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప విషయం మంచి తల్లిగా వుండటం. నాకు ఏ కిరీటాలు వద్దు. మంచి తల్లిని అనిపించుకుంటే చాలు” అని చెప్పేది శ్రీదేవి. మొన్న శ్రీ దేవి ‘మామ్ ‘సినిమా వచ్చింది. తల్లి ప్రేమ చుట్టూ తిరిగే కధ ఇది. ఈ సినిమా కధ గురించి, మాతృత్వం గురించి మాట్లాడిన శ్రీదేవి ఒక దశలో ఏడ్చేసింది. పిల్లల కోసం అలాంటి పరిస్థితే వస్తే ఒక తల్లిగా నా ప్రాణ త్యాగానికైనా సిద్దమేనండి’ అని కన్నీళ్ళు పెట్టుకుంది.
అదే సందర్భంలో ఓ ప్రశ్న ఎదురైయింది. మీరు జీవితంలో విజయం సాధించినట్లేనా? అని. దానికి శ్రీదేవి ఇచ్చిన సమాధానం. ‘’’లేదు. నేను జీవితంలో ఇంకా సక్సెస్ కాలేదు. ఎప్పుడైతే నా పిల్లలకి పెళ్లి చేసి, వాళ్ళు”మా జీవితం చాలా ఆనందంగా వుందమ్మా’ అని చెప్తారో అప్పుడే నేను విజయం సాధించినట్లు లెక్క. అదే నా చివరి కోరిక కూడా” అని కంట్లో నీళ్ళు తుడుచుకుంది శ్రీదేవి.
అయితే విధి మరోలా తలచింది. ఆ తల్లిని బిడ్డలకు దూరం చేసేశాడు విధాత. అందుకే నటిగా ఆమె అత్మతకు శాంతి ఉటుందేమో కానీ ఒక తల్లిగా మాత్రం ఆమె ఆత్మ ఆ బిడ్డల భవిష్యత్ చుట్టే తిరుగుతుంది. శ్రీదేవి చివరి కోరిక తీరేదాక.