కేంద్రం తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు..! భాజపా సర్కారుపై ఆయన విమర్శలు చేయడం అనేది ఈమధ్య లేనే లేదు. ఇంకా చెప్పాలంటే భాజపాతో అప్రకటిత మిత్రపక్షంగానే ఇటీవల వ్యవహరిస్తూ వస్తున్నారు. అలాంటిది, సీఎం కేసీఆర్ కేంద్రంపై సున్నితంగానైనా విమర్శలు చేయడమంటే కాస్త ఆసక్తికరమైన అంశమే. కరీంనగర్ లో జరుగుతున్న రైతు సమన్వయ కమిటీ ప్రాంతీయ సదస్సుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలంటూ తీర్మానించారు.
ఇదే విషయమై తాను కేంద్రాన్ని చాలాసార్లు కోరాననీ, కానీ ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శించారు. మన రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితికి కారణం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లు అని ఆరోపించారు. దేశ రైతును అర్థం చేసుకోవడంతో ఈ రెండు పార్టీలూ ఘోరంగా విఫలమయ్యాయి అన్నారు. వీరి విధానాలు ఎక్కడా పనికిరాలేదన్నారు. దశాబ్దాలు గడుస్తున్నా వీళ్లంతా కబుర్లు మాత్రమే చెబుతున్నారన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటూ తాను ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు చెప్పాను అన్నారు. అలాగే, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి కూడా చెప్పానన్నారు. ఈ మధ్య కూడా భాజపాకు చెందిన ఓ నాయకుడుతో ఇదే విషయం ప్రస్థావించానన్నారు. కానీ, వారికి చీమకుట్టినట్టైనా అనిపించడం లేదన్నారు. ఇవేవీ పట్టించుకునే స్థితిలో వారు లేరనీ, ఇవాళ్ల కేంద్రం రైతుల వాస్తవ సమస్యలు అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే, రైతుల అంశమై కేంద్రాన్ని నిలదీయాలంటూ ఎంపీలకు సూచించారు. మార్చి 5 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో రైతుల అంశమై భాజపా సర్కారుపై ఒత్తిడి పెంచాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఒక రైతు బిడ్డగా తాను భాజపా, కాంగ్రెస్ హైకమాండ్లకు ప్రశ్నిస్తున్నాననీ, రైతులకు వారు చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి లభ్యతలో ప్రస్తుతం మనం ఓ 35 శాతం మాత్రమే వాడుకోగలుగుతున్నామనీ, ఇది తెలివితక్కువ భాజపా, కాంగ్రెస్ నేతల వైఫల్యం కాదా అని నిలదీశారు. దేశంలో రైతులు సమన్వయం కోల్పోతున్నారన్నారు. సమయం వస్తే రైతులే తగిన బుద్ధి చెబుతారన్నారు. మొత్తానికి, కాంగ్రెస్ తో పాటు భాజపాని కూడా ఒకే గాటన కట్టి కేసీఆర్ విమర్శలు చేయడం విశేషం!