ఇదెక్కడి జాబితా అనుకుంటున్నారా..? ప్రతిపక్ష పార్టీకి చెందిన పత్రిక తయారు చేసి జాబితా..! వచ్చేనెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 16 రాష్ట్రాల్లోని 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలుంటాయి. వీటిలో మెజారిటీ సీట్లను దక్కించుకోవడం కోసం భాజపా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ల నుంచి ఈసారి భాజపాకి పెద్ద సంఖ్యలో రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం ఉంది. అయితే, ఈ వార్తను ‘సాక్షి’ పత్రిక… ‘రాజ్యసభలో భాజపా హవా’ అనే శీర్షికతో రాసింది. విషయమంతా ఓకే.. కానీ, మధ్యలో ఓ చోట.. ఎన్డీయే మిత్రపక్షాలతోపాటు కేంద్రానికి అనుకూలంగా ఉన్న పార్టీల జాబితాలో వైకాపా కూడా ఉందని రాశారు! రాజ్యసభలో వారి మద్దతు కూడా ఉంటుందన్నట్టు ఆ కథనంలో పేర్కొనడం విశేషం.
టీడీపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన వైకాపాతో భాజపాకి వైరం ఉండాల్సిన అవసరం లేదు. భాజపా దృష్టిలో ఏపీలో ఈ రెండూ ప్రాంతీయ పార్టీలే. భాజపా తమ మిత్రపక్షమని వైకాపా చెప్పుకున్నా ఫర్వాలేదు. అలా పిలిపించుకునేందుకు భాజపా కూడా సిద్ధంగా ఉన్న వాతావరణం కనిపిస్తోంది కదా. కానీ, దానికంటూ ఒక సమయమూ సందర్భమూ ఉంటాయి కదా. ప్రస్తుతం కేంద్రం – ఏపీ మధ్య పరిస్థితి ఏంటీ..? ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం చూపుతున్న సవతి తల్లి ప్రేమ ఏ స్థాయిలో ఉంది..? ఇస్తామన్న నిధులు ఇవ్వలేదు, హామీలు అమలు చేయని పరిస్థితి ఉంది. భాజపాతో భాగస్వామ్య పక్షమైన ఏపీ అధికార పార్టీ కూడా ఇవాళ్ల కేంద్రంతో ఢీ అనే పరిస్థితికి ఎందుకొచ్చింది..? ప్రస్తుతం భాజపాపై ఆంధ్రా ప్రజల మనోభావం ఎంత ఆగ్రహంగా ఉంది..? క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితులు ఉంటే… తమని తాము ‘ఎన్డీయేకి సానుకూల పక్షం’ అని పత్రిక ద్వారా చెప్పుకునే ప్రయాసను ఏమని అర్థం చేసుకోవచ్చు..?
టీడీపీ పొత్తు తెంచుకుంటే, భాజపా చంకనెక్కేందుకు వైకాపా కాచుకుని కూర్చుందని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి..? ఏపీలో అధికార పక్షం దూరం కాగానే, ప్రతిపక్షం తమకు చేరువయ్యే క్రమంలో ఉందంటే… మన ఐక్యత పట్ల కేంద్రానికి చులకన భావం రాదా..? రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని ఇలా సంకేతాలు ఇస్తూ.. మరోపక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాటం, అవిశ్వాసం పెట్టాలని అంటుంటే వారికి కామెడీగా అనిపించదూ..! రాజకీయ లబ్ధి బుద్ధిని ఇంత బహిరంగంగా ప్రదర్శించుకుంటే, ఎవరు మాత్రం ఇచ్చిన హామీలు అమలు చేస్తారు..? భాజపా పక్కన వైకాపాను చేర్చాలన్న లక్ష్యంతో ఇలా రాసుకుంటూ పోతే… విభజన హామీలు నెరవేర్చకపోతే ఏపీలో అన్ని పార్టీలూ ఏకమై కేంద్రంపై తిరుగుబాటు చేస్తాయేమో అనే భయం కేంద్రానికి ఎందుకు ఉంటుంది చెప్పండి…?