‘శ్రీదేవిని చంపేశారా?’… యావత్ భారతావని మదిలో ఇప్పుడీ ఒక్క ప్రశ్నే మెదులుతోంది. ఆమె మృతిపై వస్తున్న వార్తలు క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కమర్షియల్ థ్రిల్లర్ సిన్మాకు ఏమాత్రం తీసిపోని రీతిలో 48 గంటలుగా అతిలోక సుందరి మరణ చిత్రం అనూహ్య మలుపులు తీసుకుంటోంది. ముఖ్యంగా దుబాయ్ అధికారులు శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ని సుదీర్ఘంగా విచారించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు కపూర్ ఫ్యామిలీ మౌనంగా వుండడమూ జనాలకు నచ్చడం లేదు. శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులు మాట్లాడడం లేదని జనాలు అనుకోవడం లేదు. కపూర్ ఫ్యామిలీ ప్రవర్తన అనుమానాస్పదంగా వుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
శ్రీదేవి మరణించిన సంగతిని బోనీ కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్ స్వయంగా వెల్లడించారు. గుండెపోటుతో వదినగారు మరణించినట్టు పేర్కొన్నారు. గతంలో ఆమెకు ఎలాంటి హృదయసంబంధిత అనారోగ్యాలూ లేవనీ, గుండెపోటు వచ్చిన సమయంలో శ్రీదేవి హోటల్ బాత్రూమ్లో వున్నారని సంజయ్ మీడియాకు తెలిపారు. దుబాయ్ అధికారుల ఫోరెన్సిక్ నివేదిక శ్రీదేవి గుండెపోటుతో మరణించలేదని, ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి నీటిలో మునిగి మరణించారని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రజల్లో తొలి అనుమానపు బీజం నాటింది.
- * బాత్‌టబ్‌లో మునిగి మరణిస్తే? సంజయ్ కపూర్ గుండెపోటు అని ఎందుకు చెప్పారు?
- * కార్డియాక్ అరెస్టుతోనే చనిపోయినట్టు ఏ డాక్టరు నిర్ధారించారు?
- * సంజయ్ కపూర్‌కి శ్రీదేవి మరణవార్తను చెప్పింది ఎవరు? బోనీ కపూరే స్వయంగా ఫోన్ చేశాడా? చేస్తే ఫోనులో ఏం చెప్పాడు?
దేశం మొత్తం గర్వించే నటి మృతిపై సవాలక్షా ప్రశ్నలు వస్తున్నప్పుడు కపూర్ ఫ్యామిలీకి సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది. మరణవార్తను ధృవీకరించిన వాళ్ళు మౌనంగా ఎందుకు వుంటున్నారు?
పైన ప్రశ్నలు పక్కన పెడితే.. దుబాయ్‌లో బోనీ కపూర్ వెల్లడించిన విషయాలు కూడా నమ్మశక్యంగా అనిపించడం లేదు. బాత్‌టబ్‌లో శ్రీదేవి అపస్మారక స్థితిలో పడి వున్నప్పుడు లేదా కనిపించినపుడు బోనీ కపూర్ హోటల్ డాక్టర్ని పిలవకుండా మిత్రుడికి ఎందుకు ఫోన్ చేశారు? శ్రీదేవి కంటే రెండు రోజుల ముందు ఆయన ఇండియాకు ఎందుకు వచ్చారు? దుబాయ్‌లో జరిగిన పెళ్ళిలో మొదటి భార్య సంతానం అర్జున్ కపూర్, అతని సోదరితో తండ్రిగా బోనీ సన్నిహితంగా వుండడం శ్రీదేవికి నచ్చలేదా? ఆస్తి విషయమై భర్తతో గొడవలు జరిగాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి వుంది. ఇక, విమానాశ్రయంలో శ్రీదేవి గురించి స్పందించకుండా మీడియాకి ముఖంగా చాటేస్తూ అర్జున్ కపూర్ దురుసుగా వెళ్ళడాన్ని ప్రజలు గమనించారు. ఇవన్నీ ప్రస్తుతానికి శేష ప్రశ్నలే. త్వరగా జవాబులు వస్తాయని ప్రజలు ఆశతో వున్నారు.