ఆరోజున కేసీఆర్ కు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రి పదవి ఇచ్చి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది అనేది చాలామంది అనేవారు! 1999లో చంద్రబాబు ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో అప్పటికి టీడీపీ నేతగా ఉన్న కేసీఆర్ కు మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురై, పార్టీ నుంచి బయటకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించారు. అప్పటికే కొన్నేళ్లుగా తెలంగాణ ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కేసీఆర్ దిక్సూచిగా మారారు. అలా మరోసారి మొదలైన తెలంగాణ సాధన ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో తీవ్రమై, ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైంది. ఏపీ ముఖ్యమంత్రి నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలోని కొన్ని కీలకమైన ఘటనలను గుర్తు చేసుకుంటూ.. కేసీఆర్ గురించి కూడా మాట్లాడారు.
ఆరోజున విజయ రామారావు కోసం ఆలోచించి, కేసీఆర్ విషయంలో అలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన ఉన్నత ప్రభుత్వోగం నుంచి వచ్చారు, మంచి అనుభవం ఉంది కాబట్టి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో అలా ఆలోచించాల్సి వచ్చిందన్నారు. అయితే, ఒక్కోసారి చరిత్రను తిరగరాయలేంగానీ, దాన్ని సమీక్ష చేసుకుంటామన్నారు. ఒక్కోసారి చరిత్రలో కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు ఉంటాయని సరదాగా నవ్వుతూ చెప్పారు. అయితే, తనతో కేసీఆర్ ఎప్పుడూ చాలా బాగా ఉండేవారన్నారు. తీసుకున్న ప్రతీ నిర్ణయంతో ఏదో జరిగిపోతుందని ముందే అనుకుంటూ పోతే ఏదీ చేయలేమన్నారు. కేబినెట్ అన్నాక చాలామందిని మంత్రులుగా తీసుకుంటూ ఉంటాం, మధ్యలో మార్పులూ చేస్తుంటామన్నారు. ఇలాంటి సందర్భంలో ఏదో జరిగిపోతూ ఉంటుందని అనుకుంటూ పోతే, పునర్ వ్యవస్థీకరించలేం అని చంద్రబాబు చెప్పారు.
కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఒక్కోసారి జడ్జిమెంట్ అనేది అనుకున్నట్టుగా ఉండకపోవచ్చన్నారు. కీర్తి కోసం పాకులాడి కూడా కొన్ని నిర్ణయాలు అలా తీసుకోవడం జరిగిపోతుందన్నారు! ఒక్కోసారి చరిత్ర మీ చేతుల్లో ఉంటే రాసుకోవచ్చనీ, కానీ కొన్నికొన్ని మీ చేతుల్లో ఉండవూ రాయలేం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కొన్ని ఊహకు కూడా అందవనీ, అలా అనుకుంటే ఏపనీ చేయలేమన్నారు. నాడు కేసీఆర్ ను కేబినెట్ లోకి తీసుకోకపోవడంపై చంద్రబాబు నేటి స్పందన ఇలా ఉంది.