హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర మంత్రి దత్తాత్రేయకుగానీ, స్మృతి ఇరానీకి గానీ సంబంధం లేదని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. ఆయన ఇవాళ హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తీవ్రవాది యాకూబ్ మెమెన్‌కు ఉరిశిక్ష వేయటాన్ని వ్యతిరేకిస్తూ రోహిత్, అతని స్నేహితులు ఫేస్బుక్లో పోస్టులు రాయటాన్ని ఏబీవీపీకి చెందిన సుశీల్ అనే విద్యార్థి నిరసించాడని కిషన్ చెప్పారు. దీనికి గానూ సుశీల్‌ను వారు చితకబాదారని, అతని వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయని, అనేక రోజులు ఆసుపత్రిలో ఉన్నాడని అన్నారు. దీనిపై సుశీల్ తల్లి హైకోర్టును కూడా ఆశ్రయించారని తెలిపారు. ఈ ఘటనపై ఏమి చర్యలు తీసుకున్నారని హైకోర్ట్ యూనివర్సిటీ పాలకవర్గాన్ని ప్రశ్నించిందని చెప్పారు. దీనిపై స్పందిస్తూ యూనివర్సిటీ పాలకవర్గం ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిందని అన్నారు. దత్తాత్రేయ స్మృతి ఇరానీకి లేఖ రాసినది సస్పెన్షన్ తర్వాత అని చెప్పారు. ప్రతి దానికీ రాజకీయ రంగు పులమటం సబబు కాదని అన్నారు. పైగా రోహిత్ లేఖలో దత్తాత్రేయ పేరుగానీ, స్మృతి ఇరానీ పేరుగానీ లేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎంపీ కవిత కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా ఇలా దత్తాత్రేయపై బురద జల్లటానికి ప్రయత్నిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.