తెలంగాణ తెలుగుదేశం పార్టీ దాదాపు అంపశయ్య మీద ఉందన్నది వాస్తవం. పేరున్న నాయకులు పార్టీలు వీడిపోయారు. రేపోమాపో మరికొందరు అంటూ కొన్ని పేర్లు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ మూలాలు ఇప్పటికీ కాస్త బలంగా ఉన్న మాట వాస్తవమే. వాటి పునాదులపై పార్టీని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం టి. టీడీపీకి సరైన రాష్ట్ర నాయకత్వం లేదు. దీంతో కిందిస్థాయి కేడర్ లో ఉత్సాహం నింపుతూ, పార్టీ భవిష్యత్తుపై వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపైనే ఇప్పుడుంది. రాజకీయాల్లోకి వచ్చి నలభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయనీ, మన పోరాటాలను కొనసాగించుకుంటూ పోతే అవకాశాలు వస్తుంటాయని చంద్రబాబు అన్నారు. చిత్తశుద్ధితో క్రమశిక్షణలో ముందుకు పోతున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సునాయాశంగా జీవించే పరిస్థితి వస్తుందన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారనీ, పోరాటాలు చేశారన్నారు. కొంతమంది నాయకులు పార్టీని విడిచిపోయినా, కార్యకర్తలు పార్టీని నమ్ముకుని ఉన్నారన్నారు. అందుకనే, పార్టీ అధ్యక్షుడు రమణతోపాటు నాయకులకు ఓ పిలుపునిచ్చాననీ, మీరంతా ప్రజల్లో ఉండాలనీ, ప్రజలతో ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఆదరణ లభిస్తుందని అన్నారు. రాజకీయాలు మారుతూ ఉంటాయనీ, పాత రోజులు మళ్లీ వస్తాయనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. తెలంగాణలో భాజపా పొత్తు గురించి మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకున్నామనీ, కానీ మనకు చెప్పకుండానే టీడీపీతో పొత్తు లేదని వారు ప్రకటించారన్నారు.
తెలంగాణలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఒక్క టీడీపీకి మాత్రమే ఉన్నారనీ, వారందరికీ అండగా ఉండాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. తెలుగువారి కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉండాలన్నారు. పని ఒత్తిడి వల్ల ఎక్కువగా ఇక్కడికి రాలేకపోతున్నాననీ, నవ్యాంధ్రను నిర్మించాల్సిన బాధ్యతను మరోసారి తనకు ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. ఆయన ప్రసంగంలో చాలావరకూ కార్యకర్తల చుట్టూనే తిరిగింది. వారిలో ఆత్మవిశ్వాసం నింపడమే లక్ష్యంగా చంద్రబాబు మాట్లాడినట్టున్నారు. నిజానికి, ద్వితీయ శ్రేణి నాయకత్వం చురుకైన పాత్ర పోషించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది.