‘ప్రత్యేక హోదా’ ఎప్పుడొస్తుందంటే… వైకాపా అధికారంలోకి వస్తేగానీ సాధ్యం కాదనేది జగన్మోహన్ రెడ్డి తీర్మానం..! ఇక, కాంగ్రెస్ పార్టీ మరింత భారీ లక్ష్యం పెట్టుకుంది. జగన్ అయితే ముఖ్యమంత్రి వరకే ఆగారు. కానీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప ఆంధ్రాకి ప్రత్యేక హోదా రాదన్నది వారి టార్గెట్..! ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా ఇదే చెబుతున్నారు. గత వారంలో ఓ సందర్భంలో ప్రత్యేక హోదా అంశమై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా మాట్లాడుతూ… రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోగానే, మొదటి సంతకం ఏపీ ప్రత్యేక హోదా ఫైల్ మీదే పెట్టేస్తారన్నారు. ఇప్పుడు మరో సీనియర్ నేత కుంతియా కూడా అదే మాట చెబుతున్నారు..!
తిరుపతిలో విలేకరులతో కుంతియా మాట్లాడుతూ… విభజన సమయంలో చేసిన చట్టాలను అమలు చేయడంలో ఎన్డీయే పూర్తిగా విఫలమైందన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ ఇప్పుడు అన్ని వర్గాల నుంచి వినిపిస్తోందనీ, దాన్ని ఇవ్వడంలో భాజపా సర్కారుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఏపీకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సాధ్యమన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే ప్రత్యేక హోదా ప్రకటించేస్తారని చెప్పారు. కుంతియా వ్యాఖ్యగానీ, అంతకుముందు రఘువీరా వ్యాఖ్యగానీ ఎలా ఉందంటే… హోదా ప్రకటించేందుకు పత్రాలను కూడా రాహుల్ సిద్ధం చేసేసుకున్నట్టూ, చేతిలో పెన్ను పట్టుకుని వెయిట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు!
ఆంధ్రా ప్రజల ప్రయోజనాల మీద కాంగ్రెస్ కు నిజమైన చిత్తశుద్ధి ఉంటే… గడచిన నాలుగేళ్లూ ఈ నేతలంతా ఏమైపోయినట్టు..? కుంతియా, జైరాం రమేష్ వంటి జాతీయ నేతలు ఏపీపై కురిపిస్తున్న ప్రేమ గతంలో ఏమైంది..? నిజానికీ, ఏపీ విషయంలో భాజపా అనుసరిస్తున్న వైఖరికీ, కాంగ్రెస్ వైఖరికీ పెద్దగా తేడా ఏముంది..? భాజపాకి ఏపీ అంటే కొన్ని ఎంపీ సీట్లు. ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రత్యేక హోదా అనేది ఏపీలో బాగా వర్కౌట్ కాబోయే ఎన్నికల ప్రచారాంశం.. అంతిమంగా అధికారంలోకి వస్తే తప్ప హోదా కోసం ఎవ్వరూ ఏమీ చేయరన్నమాట. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది కదా. ఈలోగా కేంద్రాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం ఏదైనా చెయ్యొచ్చు. జగన్ ముఖ్యమంత్రి అయితే తప్ప హోదా సాధించలేరు, రాహుల్ ప్రధాని అయితే తప్ప హోదాపై సంతకం చేయలేరు..! ఈలోగా ఏపీలో అధికార పార్టీ కేంద్రంతో పోరాడుతుంటే కనీసం దానికి మద్దతు కూడా ఇవ్వలేరా..? మరి, ప్రతిపక్ష నేతలుగా వీరేం చేస్తున్నట్టు..?