అసలే కాంగ్రెస్, అందునా తెలంగాణ నేతలు..! పంతాలూ పట్టింపులూ గ్రూపులూ శాఖలు మరీ ఎక్కువ. కలిసికట్టుగా మొదలుపెట్టిన బస్సుయాత్ర మొదలై కనీసం నాలుగు రోజులైనా కాలేదు, అప్పుడేవారి పాత బుద్ధిని బయటపెట్టేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కొంతమంది సీనియర్లు గుర్రుగా ఉన్నారట. తమను టార్గెట్ చేస్తున్నట్టుగా రేవంత్ మాట్లాడటంపై కాస్త అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. బస్సు యాత్ర ప్రారంభం నాడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలేంటంటే… ‘అవలోడు కబడ్డీ ఆడుతుంటే, మనం కేరంబోర్డ్ ఆడితే నచ్చుతదా..? అవతలోడు కుస్తీ కొట్లాడదమని తొడలు కొడితే, మనం కూచిపూడి చేస్తమంటే చెల్లుద్దా..? ఈయాల అవతలోడు తొడగొడితే, మనం దౌడ పగులగొడితే తప్ప నడిచే పరిస్థితి లేద’ని అన్నారు. కాంగ్రెస్ ని కేసీఆర్, కేటీఆర్ లు కలిసి లోఫర్ పార్టీ అనీ, రాహుల్ ని ముద్దపప్పు సుద్దపప్పు అంటూ మాట్లాడుతుంటే వినుకుంటూ కూర్చోవాలా అని ప్రశ్నించారు.
పరోక్షంగా రేవంత్ వ్యాఖ్యలన్నీ సీనియర్లకు బాగానే తగిలాయట. అంటే, మాకు ఇన్నాళ్లూ తెరాసకు ఎలా బదులివ్వడమో తెలీదన్నమాట అనీ ఓ సీనియర్ నేత ఆఫ్ ద రికార్డ్ వ్యాఖ్యానించారట. రేవంత్ వస్తే తప్ప కేసీఆర్ ను ఎలా తిప్పిగొట్టాలో తమకు వ్యూహం లేదన్నట్టుగా ఆ వ్యాఖ్యలున్నాయని తప్పుబడుతున్నారట. వేదికపై సీనియర్ల విధానాలను రేవంత్ తప్పుబట్టే విధంగా మాట్లాడితే కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు అనేది ఇప్పుడు టి. కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయం అవుతోందని సమాచారం. అయితే, దీన్ని మరీ పెద్దది చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా ఉత్తమ్ కుమార్ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా, ఒకరిద్దరు సీనియర్ నేతలు మాత్రం కాస్త గుస్సాగానే ఉన్నారట.
నిజానికి, రేవంత్ చేసిన ఆ వ్యాఖ్యల్లో సీనియర్ల వైఖరిని తప్పుబట్టేకన్నా… పార్టీలో తన ప్రాధాన్యతను డిమాండ్ చేస్తున్నట్టుగానే ఎక్కువగా ఉన్నాయి. తెరాసను ధీటుగా ఎదుర్కోవాలంటే తను దూకుడుగానే ఉండాలనీ, తనలో ఉన్న ఆ సహజ దూకుడుని సరిగా వాడుకోవాలంటూ పార్టీ నేతలకు రేవంత్ చెప్పకనే చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ పార్టీలో తన స్థానం ఏంటనేదానిపై రేవంత్ కి స్పష్టత లేదు కదా. కాబట్టి, ఆ విషయాన్ని సీనియర్లు గుర్తించాలి కదా.