ప్రస్తుతం ‘రంగస్థలం’ పనుల్లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. అవి ఓ కొలిక్కి వచ్చేస్తుండడంతో బోయపాటి శ్రీను సినిమాలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. చరణ్ – బోయపాటి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరో లేకుండా కొన్ని కీలక సీన్లు లాగించేశాడు బోయపాటి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈనెల 6 నుంచి చరణ్ రంగంలోకి దిగుతున్నాడు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీటికి కన్నల్ కన్నన్ నేతృత్వం వహిస్తారు. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్లంటే ఏ రేంజులో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చరణ్ బాడీ లాంగ్వేజ్‌ని దృష్టిలో ఉంచుకొని, పవర్ ఫుల్‌గా ఈ యాక్షన్ సీన్లు రూపొందిస్తున్నార్ట. ‘రంగస్థలం’లో చరణ్ గుబురు గడ్డంతో కనిపించాడు. ఈసినిమా కోసం తన స్టయిల్ పూర్తిగా మారబోతోంది. మరి.. అది ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.