ఇంటర్ కాలేజీకి వెళ్ళే కొడుకు ముచ్చటపడ్డాడనో… ఇంట్లో కూతురు మారం చేసిందనో.. 18 ఏళ్ళ వయసులోపు గల పిల్లలకు మోటర్ సైకిళ్ళు, కార్లు కొని ఇచ్చే తల్లిదండ్రులు ఒకట్రెండుసార్లు ఆలోచించుకోండి. మీ చేత ఊచలు లెక్కపెట్టించడానికి పోలీసులు రెడీగా కాచుకుని కూర్చున్నారు. మీ పిల్లలు కూడా ఊచలు లెక్కపెట్టే ప్రమాదం వుంది. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాడని బుధవారం 14 ఏళ్ళ బాలుణ్ణి చట్టప్రకారం జువైనల్ హోంకి పంపించారు పోలీసులు. నాలుగు వారాలు బాలుడు జువైనల్ హోంలో ఉండాలి. మైనారిటీ తీరని పిల్లలకు బైక్స్, కార్స్ ఇచ్చి డ్రైవింగ్ చేయడానికి అనుమతించిన పదిమంది తల్లిదండ్రులపై మోటార్ వెహికల్స్ చట్టంలోని 180 సెక్షన్ ప్రకారం గురువారం కేసులు నమోదు చేశాడు. జైలుకి పంపించారు. కోర్టులు కూడా ఈ అంశంలో తల్లిదండ్రులను ఉపేక్షించడం లేదు. చివాట్లు పెడుతున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మైనర్స్ డ్రైవింగ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్న కేసులు వెయ్యికి పైగా వున్నాయి. వాళ్ళ తల్లిదండ్రుల్లో 45 మంది జైలుకు వెళ్ళారు. సో.. చిన్నారులకు బైక్స్, కార్స్ కొనే ముందు, వారి చేతికి తాళాలు ఇచ్చే ముందు ఒకటిరెండు సార్లు ఆలోచించుకోండి. తల్లిదండ్రులూ… తస్మాత్ జాగ్రత్త.