ఆంధ్రాకి కేంద్ర సాయం అనే అంశంపై భాజపా ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. ఆ దిశగా చర్యలు ఉన్నాయని చెబుతున్నారే తప్ప.. ఆ చర్యల్లో చిత్తశుద్ధి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల విషయమై అధికార పార్టీ టీడీపీ, భాజపాల మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ- భాజపాల మధ్య తలెత్తిన ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసం తనవంతు కృషి చేస్తానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబుకు మాటిచ్చినట్టు కథనాలు వచ్చాయి. దీనికి అనుగుణంగానే వెంకయ్య చొరవతో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, టీడీపీ ఎంపీ రామ్మోహన నాయుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావులతో మాట్లాడారు. అయితే, దాదాపు గంటపాటు జరిగిన ఈ చర్చల్లో ఎలాంటి పరిష్కారం లభించలేదు.
ఇంతకీ, ఆ సమావేశంలో లభించిన పరిష్కారం ఏంటనేది ఇరువర్గాల నేతలూ మీడియాతో చెప్పకపోవడం విశేషం. అయితే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో ఓ మాట చెప్పారు. ఏపీకి కేంద్రం ఒక ‘ఫార్ములా’ ఇచ్చిందన్నారు. దానిపై ఏపీ అధికారులను స్పందించమని కోరామనీ, కానీ వారు ఇంతవరకూ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని జైట్లీ అన్నారు. ఇంతకీ ఆ ఫార్ములా ఏంటనేది మాత్రం జైట్లీ చెప్పేందుకు నిరాకరించారు. ఫిబ్రవరి తొలివారంలోనే ఆర్థిక శాఖ అధికారులు ఈ ఫార్ములా గురించి ఏపీ అధికారులకు చెప్పారన్నారు. ఈ విషయమై ఆంధ్రా ప్రభుత్వం నుంచి స్పందన వస్తే, తక్షణం తమ నిర్ణయాన్ని వెల్లడించేందుకు కేంద్రం సంసిద్ధంగా ఉందని అన్నారు. మరోపక్క, అమిత్ షాతో చర్చల సందర్భంగా ఏపీకి సంబంధించిన 19 డిమాండ్లను ఎంపీ రామ్మోహన నాయుడు, కుటుంబరావు ఉంచారు. అందులోని చాలా అంశాల గురించి ఇదివరకే ఫిబ్రవరి 9న రాజ్యసభలో ప్రస్థావించాం కదా అని అమిత్ షా అన్నారట. సమస్యల విషయమై ముఖ్యమంత్రితో తాను స్వయంగా మాట్లాడతానని అమిత్ షా చెప్పినట్టు తెలిసింది.
మొత్తానికి, ఏపీ సమస్యల విషయమై కేంద్రం దగ్గరున్న ఆ ఫార్ములా ఏంటో అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో కూడా రాష్ట్ర అధికారుల స్పందన కోసం తాము వెయిట్ చేస్తున్నామని జైట్లీ చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? ఏపీకి అత్యవసరమైన 19 అంశాలపై కూడా అమిత్ షా పాత పాటే పాడుతూ ఉండటం విశేషం. చంద్రబాబుకు ఇచ్చిన మాట ప్రకారం ఉపరాష్ట్రపతి చొరవ తీసుకుని సమావేశం ఏర్పాటు చేసినా.. మళ్లీ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ విషయంలో భాజపా వైఖరి ఏంటనేది ఈ మీటింగ్ ద్వారా మరోసారి స్పష్టమైంది. ఏపీ సమస్యలకు పరిష్కారం చూపించాలనే చిత్తశుద్ధి భాజపా వ్యవహార శైలిలో ఏమాత్రం కనిపించడం లేదు.