సుకుమార్ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే ఇక సూపర్ హిట్ పాటల కోసం ఫిక్సయిపోయినట్టే. రంగస్థలంలోనూ అలాంటి మ్యాజిక్ ఆశిస్తున్నారు అభిమానులు. దానికి తగ్గట్టే తొలి పాట అదరగొట్టేశారు. ‘ఎంత సక్కగున్నావే’ పాట ఎక్కడ చూసినా మార్మోగిపోతోంది. ఈ టీమ్ నుంచి మరో పాట వచ్చింది. ‘రంగ రంగ రంగ స్థలాన’ అంటూ. మంచి ఫోక్ బీట్ ఈ పాట. 1985 నాటి కథ ఇది. పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. దానికి తగ్గట్టు జాతర పాట. ఎలక్ట్రికల్ పరికరాలు పక్కన పెట్టి లైవ్ ఇనిస్ట్రుమెంట్స్ వాడడానికి దేవికి ఓ అవకాశం దొరికింది. దాన్ని పూర్తిగా సద్వినియోగ పరచుకున్నాడు దేవి. జాతర పాట.. అందులోనూ ఫోక్. రంగస్థలం పేరుకు తగ్గట్టు… పాటని చక చక రాసేశాడు చంద్రబోస్. పాటలో కాస్త తత్వం వినిపిస్తుంది. రామాయణ, మహాభారతాల్ని కోడ్ చేయడం బాగుంది. కాకపోతే.. ఇంకా బాగా రాయగలిగేంత స్కోప్ ఈ పాటకి ఉంది. కొన్ని చోట్ల కాస్త లోతైన భావాల్ని పలికించిన చంద్రబోస్.. ఇంకొన్ని చోట్ల మామూలు పదాలతో తేల్చేశాడు. దేవి నుంచి వచ్చిన కొత్త రకమైన పాట ఇది. ఇక మీదట పల్లెటూరి పాట, అందులోనూ జాతర పాట అంటే.. ఈ పాటే పాడుకుంటారేమో.