శుక్రవారం అంటే కొత్త సినిమాల హడావుడితో థియేటర్లు కళకళలాడేవి. చిన్నదో, పెద్దదో…. ఓ కొత్త సినిమా పోస్టరు మాత్రం కనిపించేది. అలాంటిది ఈ శుక్రవారం థియేటర్లు వెలవెలబోయాయి. చిత్రసీమకూ, డిజిటల్ ప్రొవైడర్లకీ మధ్య చర్చలు విఫలం అవ్వడంతో ఈ శుక్రవారం నుంచి థియేటర్లు మూసివేసిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక్క థియేటర్ కూడా తెరవలేదు. దీంతో.. తొలిరోజు నష్టం రూ.25 కోట్లు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా 1700 థియేటర్లున్నాయి. ఒక్కో థియేటర్ నుంచి సుమారు 4 నుంచి 15 వేల వరకూ అద్దె వసూలు చేస్తుంటారు. ఈ ఆదాయానికి గండి పడినట్టే. థియేటర్ని నమ్ముకుని ఎన్నో వ్యాపారాలు ముడిపడి ఉంటాయి. క్యాంటీన్, సైకిల్ స్టాండు, కూల్ డ్రింక్ షాప్.. ఇలా చాలామంది ఆధారపడి ఉంటారు. వాళ్లందరూ బంద్ వల్ల ఇబ్బందుల్ని ఎదుర్కుంటున్నారు. డిజిటల్ ప్రొవైడర్లు వర్చువల్ ఫీజు కింద భారీ మొత్తం వసూలు చేస్తున్నారు. దీని వల్ల ఒక్కో థియేటర్కీ వారానికి 12వేలు చెల్లించాల్సివస్తుంది. దీన్ని 25 శాతానికి తగ్గించాలని నిర్మాతలు కోరుతున్నారు. ప్రొవైడర్లు మాత్రం 9 శాతానికి తగ్గిస్తామంటున్నారు. ఈ లెక్క తేలక.. బంద్ అనివార్యమైంది. శనివారం కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇద్దర్లో ఎవరు దిగి వచ్చినా… థియేటర్లు మళ్లీ తెరచుకుంటాయి.