త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ.. ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రెండింట భాజపా ఆధిత్యకతను ప్రదర్శించిందనే చెప్పాలి. త్రిపురలో తిరుగులేని మెజారిటీ వచ్చింది. నాగాలాండ్ లో కూడా భాజపాదే పైచేయి. అయితే, మేఘాలయాలో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నా… ఇతరులు, ఎన్.పి.పి.తో కలిసి గోవా తరహాలో ప్రభుత్వం ఏర్పాటుకు భాజపా ప్రయత్నిస్తుందనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. తాజా ఫలితాలు భాజపాకి కొత్త జోష్ ఇస్తాయనడంలో సందేహం లేదు. గతంలో పెద్దగా పట్టులేని తూర్పు, ఈశాన్య భారతంలో కూడా భాజపా ఆధిక్యాన్ని ప్రదర్శించడం విశేషం. త్రిపురలో కమ్యూనిస్టులను భాజపా మట్టికరిపించడం విశేషం.
అయితే, ఈ అసెంబ్లీల ఫలితాలు 2019 లోక్ సభ ఎన్నికలపై ప్రభావితం చూపుతాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల నమ్మకమూ అభిమానం పెరుగుతోందనడానికి ఇదే కొలమానాలని భాజపా ప్రచారం చేసుకుంటుంది. దాన్లో కొంతవరకూ నిజం కూడా ఉంది. ఎంతవరకూ అంటే… తూర్పు, ఈశాన్య రాష్ట్రాల వరకూ మాత్రమే! ఈ ఫలితాలను ఇతర రాష్ట్రాలకు అన్వయించలేం. ఎందుకంటే, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలనే తీసుకుంటే.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భాజపాకి అనుకూలమైన పరిస్థితులు పెద్దగా లేవు.
ఆంధ్రాలో పరిస్థితి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు అనుమానంగానే ఉంది. తెలంగాణలో కూడా భాజపాకీ తెరాసకు పొత్తు కుదిరే ప్రతిపాదన ఇప్పుడైతే చర్చల్లో లేదు. పైగా, ప్రధాని మోడీపై కేసీఆర్ తాజాగా విమర్శలు పెంచుతున్నారు. తమిళనాడులో కూడా భాజపాకి అవకాశం ఉండకపోవచ్చు. కమల్ ఎంట్రీతో అక్కడా సమీకరణాలు మారుతున్నాయి. భాజపా అంటే అక్కడ సహజంగానే కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఇక, కర్ణాటక తీసుకుంటే… అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తోంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. శక్తులన్నీ ఒడ్డి అక్కడ గెలవాలన్నది కాంగ్రెస్ పట్టుదల. ఆ విజయోత్సాహంతోనే లోక్ సభ ఎలక్షన్స్ కు వెళ్లాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఓవరాల్ గా దక్షిణాదిన పెద్ద రాష్ట్రాల్లో భాజపాకి కొంత ఎదురీత తప్పని పరిస్థితే ప్రస్తుతానికి కనిపిస్తోంది. ఇక, ఈ మధ్య వెలువడిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు కూడా భాజపాని కొంత కంగారు పెట్టాయి. భాజపా అధికారంలో ఉన్న మరో రాష్ట్రం రాజస్థాన్ లో రెండు పార్లమెంటు, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలు కూడా చేదు అనుభవం మిగిల్చాయి.
సో.. కొన్ని ప్రముఖ రాష్ట్రాల్లో భాజపా పరిస్థితి ఇలా ఉంది. అయితే, తాజా ఫలితాల నేపథ్యంలో భాజపాకి కొంత ఊరట అనే చెప్పాలి. ఎలా అంటే.. 2019 లోక్ సభ ఎన్నికల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో భాజపాకి కొంత ఎదురుగాలి ఉంటుంది. కాబట్టి, పొత్తు ద్వారాగానీ నేరుగా పోటీ ద్వారాగానీ భాజపాకి దక్కే ఎంపీ సీట్లు తగ్గే పరిస్థితి ఉంది. ఆ లోటును తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో భర్తీ చేసుకునే అవకాశం వచ్చింది..! బెంగాల్, ఒడిశా, త్రిపుర.. ఈ మూడు రాష్ట్రాల్లో బెంగాలీల ప్రభావమే ఎక్కువ. త్రిపురలో భాజపాకి లభించిన ఆదరణ ఆ పార్టీ కూడా ఊహంచలేదు. దీని ప్రభావం ఒడిశా, బెంగాల్ లో కొంతవరకూ ఉండే అవకాశం ఉంది. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల్లో మొత్తంగా దాదాపు 90 పార్లమెంటు స్థానాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో గట్టిగా ప్రయత్నిస్తే.. దాదాపు 40 లోక్ సభ స్థానాలు గెలుచుకోవచ్చనే ధీమా ఈ ఫలితాల తరువాత భాజపాకి వస్తుంది. సో.. దక్షిణాదిన జరగబోయే నష్టాన్ని అక్కడ భర్తీ చేసుకోవచ్చు అనే అభిప్రాయానికి భాజపా రావొచ్చు.