హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఉద్దేశించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రసంగించారు. రోహిత్ది ఆత్మహత్య కాదని, వ్యవస్థీకృత హత్య అని అన్నారు. దేశంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ, వర్సిటీ వీసీ విద్యావ్యవస్థను అవమానించారని అన్నారు. వారు ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సస్పెన్షన్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని యూనివర్సిటీ పాలకవర్గం కనీసం పలకరించకపోవటం అన్యాయమని అన్నారు. వర్సిటీలలో పక్షపాత ధోరణి మంచిది కాదని చెప్పారు. తాను ఇక్కడ రాజకీయాలు చేయాలనుకోవటంలేదని అన్నారు. వర్సిటీలు ఉన్నది జ్ఞానార్జనకోసమని చెప్పారు. రోహిత్ మృతికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. అభిప్రాయాలను వ్యక్తం చేసే భావప్రకటనాస్వేచ్ఛ విద్యార్థులకు ఉండాలని చెప్పారు. రోహిత్ కుటుంబానికి అన్నిరకాలుగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబసభ్యులు, ఇక్కడ ఉన్న విద్యార్థులలో ఎవరైనా సాయం కావాలనుకుంటే తనను ఎప్పుడైనా సంప్రదించొచ్చని, తాను ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటానని రాహుల్ చెప్పారు. చివరగా, నిరాహారదీక్ష చేస్తున్న విద్యార్థులను రాహుల్ పరామర్శించారు.