అనుకున్నట్టుగానే జరిగింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి నిమిషం నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల అంశమై కేంద్రం తీరుపై నిరసన గళం వినిపించింది టీడీపీ. విభజన హామీలు నెరవేర్చాలంటూ టీడీపీ ఎంపీలు లోక్ సభలో ఆందోళనకు దిగారు. విభజన చట్టంలో ఉన్న అంశాలతోపాటు, ఆంధ్రాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఎంపీలు లోక్ సభలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. అయితే, ఇదే సమయంలో టీడీపీ ఎంపీలకు తెరాస ఎంపీల కూడా మద్దతు రావడం విశేషం. విభజన హామీలు అమలుకు వెంటనే కృషి చేయాలని వారూ మాట కలిపారు. దీంతోపాటు టీంఎంసీ, అకాలీదళ్, శివసేనలు కూడా టీడీపీకి ఇదివరకే మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఉభయ సభలు ప్రారంభమైన దగ్గర్నుంచే ఏపీ అంశమై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఎప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత లోక్ సభను ఓ గంట సేపు, రాజ్యసభను పది నిమిషాలపాటు వాయిదా వేశారు. ఆ తరువాత కూడా లోక్ సభలో పరిస్థితి మారలేదు. ఏపీ సమస్యలపై వెంటనే స్పందించాలని ఎంపీలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. వరుసగా సభను రెండుసార్లు వాయిదా వేసినా.. కార్యకలాపాలు ముందుకు సాగే పరిస్థితి లేకుండా పోయింది. ఏపీకి న్యాయం చేయాలని తెలుగుదేశం ఎంపీలు, రిజర్వేషన్ల కోటా పెంచాలంటూ తెరాస సభ్యులు కూడా గళమెత్తడంతో సభ అదుపులోకి రాలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
ఇక, రాజ్యసభలో కూడా ఇదే సీన్ కనిపించింది. ఏపీకి న్యాయం చేయాలంటూ ఎంపీలు నిరసనలు తెలపడంతో సభను కాసేపు వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. ఆ తరువాత, సమావేశం ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు. టీడీపీ, వైకాపా సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ఛైర్మన్ వెంకయ్య నాయుడు కాస్త ఆగ్రహానికి గురయ్యారు. సభ తీరును దేశమంతా చూస్తోందనీ, సంయమనం పాటించాలనీ, మనం పార్లమెంటులో ఉన్నామా లేదా వేరే ఎక్కడైనా ఉన్నామా అంటూ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినాసరే, పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాకపోడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఊహించినట్టుగానే బడ్జెట్ మలివిడత సమావేశాలు ప్రారంభం కాగానే ఏపీ ఎంపీలు సభను ఉభయ సభల్నీ స్తంభింపజేశారు. ఇదే తరహాలో ఆందోళన కొనసాగిస్తే, ఏపీ అంశం జాతీయ స్థాయిలో మరింత చర్చనీయం కావడం ఖాయం.