మూడో ఫ్రెంట్ ఏర్పాటు… తెలంగాణ సీఎం కేసీఆర్ కిం కర్తవ్యంగా మారిపోయింది. ఓ నాలుగైదు రోజుల్లోనే ఆయన తీరు పూర్తిగా మారింది! కాంగ్రెస్, భాజపా పాలనలో దేశానికి ఒరిగిందేం లేదనీ, మూడో ప్రత్యామ్నాయం దేశానికి అవసరమనీ, దానికి తానే నాయకత్వం వహిస్తానంటూ స్వీయ ప్రకటన చేసుకున్నారు. అంతేకాదు, అనుకున్నదే తడవుగా కార్యాచరణ కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే మమతా బెనర్జీ ఫోన్ చేశారనీ, ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది నాయకులు తనకు టచ్ లోకి వస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. త్వరలో.. మూడో కూటమి ఏర్పాటు దిశగా దేశవ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటుకు సిద్ధమౌతున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతాల్లో దశలవారీగా ఈ సమావేశాలు ఉంటాయట. ముందుగా రిటైర్డ్ ఐఏఎస్, ఐపీయస్, ఐ.ఎఫ్.ఎస్., ఐ.ఆర్.ఎస్.లతో భేటీ అవుతారనీ, ఆ తరువాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, న్యాయ నిపుణులతో భేటీ అవుతారని సమాచారం. ఆ తరువాత, ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులూ రైతు సంఘాలతో భేటీ అయ్యేందుకు సిద్ధమౌతున్నారు. సో.. ఇదీ కేసీఆర్ కార్యాచరణ.
గడచిన కొన్ని రోజుల్లోనే కేసీఆర్ రాజకీయ ప్రాథమ్యాలు మారిపోయాయి. జాతీయ స్థాయి సమస్యల గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే క్రమంలో కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా స్పందిచడం మొదలుపెట్టారు..! తాజాగా ఆమె ఒక ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ భాజపాల వైఫల్యాల గురించి ఆమె ప్రస్థావించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలను ఉద్దేశించి స్పందిస్తూ… అనుకున్నట్టుగానే భాజపా, కాంగ్రెస్ లు దేశాన్ని తప్పుతోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఈరోజు రిజర్వేషన్ల అంశమై పార్లమెంటులో తెరాస ఆందోళన చేస్తుంటే, హామీలు నెరవేర్చాలంటూ ఆంధ్రా నిరసన వ్యక్తం చేస్తోందన్నారు. ఇంకోపక్క, కావేరీ నది సమస్యపై తమిళనాడు పోరాడుతోందన్నారు. ఈ సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే స్పందించాలనీ, పార్లమెంటులో మాట్లాడాలని కవిత డిమాండ్ చేశారు.
నిన్నమొన్నటి వరకూ రాష్ట్ర సమస్యలూ, మరీ ముఖ్యంగా తన నియోజక వర్గ అంశాలకు మాత్రమే కవిత పరిమితమై మాట్లాడుతూ ఉండేవారు. కాంగ్రెస్ – తెరాస మధ్య మాటల యుద్ధం జరుగుతున్నా పార్టీ తరఫున ఆమె స్పందించిందీ లేదు. కానీ, మూడో కూటమి అని కేసీఆర్ రూటు మార్చేసరికి… ఇప్పుడు కవిత కూడా ఇతర రాష్ట్రాల సమస్యలు – కేంద్ర ప్రభుత్వం తీరుపై స్పందించడం మొదలుపెట్టేశారు. గుణాత్మకమైన మార్పు అంటే ఇదేనేమో..?