గోవా రాష్ట్ర సచివాలయానికి నిన్న ఒక పోస్ట్ కార్డ్ అందింది. అందులో ప్రధాని నరేంద్ర మోడి మరియు రక్షణ మంత్రి మనోహర్ పార్రికర్ లను హత్య చేస్తామని హెచ్చరిక ఉంది. దానిని ఐసిస్ ఉగ్రవాదులు వ్రాసినట్లు క్రింద ఐసిస్ పేరు వ్రాసి ఉంది. గోవధపై నిషేధం విదించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆ లేఖలో పేర్కొనబడింది. సచివాలయ అధికారులు ఆ లేఖను గోవా పోలీసులకు అందజేయగా, గోవా పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే దానిపై దర్యాప్తుకు ఆదేశించారు. వారు ఆ లేఖ గురించి కేంద్రప్రభుత్వానికి తెలియజేసారు.
ఆ లేఖ ఐసిస్ ఉగ్రవాదుల పేరిట వచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఒక సాధారణ పోస్ట్ కార్డు ద్వారా ఐసిస్ సంస్థ హెచ్చరికలు జారీ చేయదు కనుక అది దేశంలో ఐసిస్ మద్దతుదారులు ఎవరో వ్రాసి ఉండవచ్చనని పోలీసులు భావిస్తున్నారు. అందులో గోవధ నిషేధం గురించి పేర్కొనడంతో ఆ అనుమానాలు నిజమని నమ్మవచ్చును. ఎందుకంటే ఐసిస్ ఉగ్రవాదులకు ఇటువంటి విషయాలపై ఎన్నడూ ఆసక్తి కనబరచిన దాఖలాలు లేవు. ఆ బెదిరింపు లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టేందుకు గోవా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.