టాలీవుడ్లోనే అత్యంత ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ రాజమౌళి చేతుల మీదుగా తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కథ దాదాపుగా రెడీ. స్ర్కిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్ అమెరికా వెళ్లారు. ఫొటో షూట్ పనిమీద. అక్కడ రెండ్రోజుల పాటు చరణ్, ఎన్టీఆర్‌లపై ఫొటో షూట్ జరుపుతారు. ప్రఖ్యాత హాలీవుడ్ ఫొటో గ్రాఫర్‌కి ఈ బాధ్యత అప్పగించాడు రాజమౌళి. అయితే చరణ్, ఎన్టీఆర్‌లతో పాటు రాజమౌళి వెళ్లలేదు. ఈ ఫొటోషూట్ బాధ్యత మొత్తం తనయుడు కార్తికేయకు అప్పగించాడు. రాజమౌళి స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉండడం వల్ల… అమెరికా వెళ్లలేదని తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లో రాజమౌళి పనులు అయిపోతే.. అప్పుడు ఆయన అమెరికా వెళ్లే ఛాన్స్ ఉంది. లేదంటే.. కార్తికేయ ఈ పనులన్నీ ముగించుకుని వచ్చేస్తాడు. స్క్రిప్టు పనులు ఓ కొలిక్కి వచ్చాక.. అప్పుడు మిగిలిన నటీనట వర్గాన్ని ఎంపిక చేయాలని భావిస్తున్నాడు రాజమౌళి. కథానాయికల జాబితాలో సమంత, రాశీఖన్నాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.