ఉరిమి ఉరిమి మేఘం మీద పడినట్టు… ఎప్పట్నుంచో సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేసిన నయనతార సినిమా సరిగ్గా నిఖిల్ సినిమా మీద వచ్చి పడింది. ఈ నెల 16న నిఖిల్ ‘కిరాక్ పార్టీ’ విడుదలవుతోంది. అదే రోజున నయనతార ‘కర్తవ్యం’నూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తమిళ హిట్ ‘ఆరమ్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇది. డబ్బింగే కదా.. అని తక్కువ చేసి పక్కకు తీసిపారేయడానికి వీల్లేదు. తమిళంలో ఈ సినిమాతో నయనతారకు లేడీ సూపర్ స్టార్ హోదాను కట్టబెట్టారు. ఇదొక లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఇందులో పేదల సమస్యల కోసం పోరాడిన కలెక్టర్ పాత్రలో నయన్ నటించింది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో చాలా వున్నాయట. కానీ, పబ్లిసిటీ ఇంకా స్టార్ట్ చేయలేదు. నయనతారను చూసి మాస్ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకమో ఏమో. అలాగే, నిఖిల్ ‘కిరాక్ పార్టీ’కి కూడా యువతలో మంచి క్రేజ్ వుంది. పైగా, కాలేజీ నేపథ్యంలో తీసిన సినిమా. ప్రోమోలు అట్ట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే… నయనతార సినిమా లేకుంటే నిఖిల్ సినిమాకు అడ్వాంటేజ్ దక్కేది.
థియేటర్ల బందు వల్ల వారం రోజులుగా ప్రేక్షకులు వెండితెరపై సినిమా చూడలేదు. ఈ శుక్రవారం 9న విజయ్ దేవరకొండ 8ఏ మంత్రం వేసావె’ విడుదలవుతోంది. దాంతో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రావడం లేదు. అందువల్ల వచ్చే శుక్రవారం నిఖిల్ సినిమాకు ఎక్కువ థియేటర్లు దొరికేవి. ఓపెనింగ్స్ దుమ్ము దులిపే ఛాన్స్ వుండేది. కానీ, ఇప్పుడు నయనతార ‘కర్తవ్యం’ 16న విడుదల చేయడం వల్ల ముందు థియేటర్లకు గండి పడుతుంది. నెక్స్ట్.. మౌత్ టాక్ బాగున్న సినిమా బాగా ఆడుతుంది. ‘దండుపాళ్యం 3’ కూడా 16న వస్తుంది. రెండో ‘దండుపాళ్యం’ ఆశించినంత ఆడలేదు. అయితే మొదటి పార్ట్ దృష్ట్యా మాస్ ప్రేక్షకుల్లో ఓ వర్గం దానికి వెళ్లే ఛాన్స్ వుంది. నిఖిల్ ‘కిరాక్ పార్టీ’, నయనతార ‘కర్తవ్యం’, ‘దండుపాళ్యం 3’ సినిమాల్లో ఏది పెద్ద హిట్ కొడుతుందో?