అనుకున్నట్టుగా ఏపీ క్యాబినెట్ లో ఉన్న భాజపా మంత్రులు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు తమ పదవులకు రాజీనామా చేశారు. నిజానికి, నిన్ననే వీరికి భాజపా అధిష్టానం నుంచి రాజీనామాలు చేయాలంటూ ఆదేశాల వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొత్తుపై ఏదైనా ప్రకటన చేస్తే వెంటనే రాజీనామాలు చేసేయాలంటూ ఏపీ భాజపా మంత్రులు సిద్ధంగానే ఉన్నారు.కానీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం అనంతరం కేంద్రంలోని టీడీపీ మంత్రులు రాజీనామా చేయాలని చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రోజు ఏపీలో ఉన్న భాజపా మంత్రులు రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రికి అందజేశారు.
ఇద్దరు మంత్రులూ సీఎంను కలిశారు. గడచిన నాలుగేళ్లలో ఇద్దరూ సమర్థంగా వారి శాఖల బాధ్యతల్ని నిర్వర్తించారని చంద్రబాబు వారిని అభినందించారు. అంతకుముందు కొంతమంది టీడీపీ మంత్రులను ఈ ఇద్దరూ కలిశారు. ఈ సందర్భంగా కామినేని వారితో మాట్లాడుతూ… రాజకీయాల్లో ప్రవేశంతోపాటు నిష్క్రమణ కూడా గౌరవప్రదంగా ఉండాలన్నారు. అంతేకాదు, ఆయన రాజీనామా లేఖలో… కేంద్రం, రాష్ట్రంలో మంచి ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరంగా ఉందని పేర్కొనడం విశేషం. ఆంధ్రాకి జరిగిన అన్యాయంపై ప్రజలు ఆవేదనతో ఉన్నారనీ, పార్టీ ఆదేశాల మేరకు రాజీనామా చేయాల్సి వస్తోందని కామినేని ఆ లేఖలో వివరించారు.
తెల్లారితే ఉప్పూ నిప్పూ అన్నట్టుగా ఉండే భాజపా- టీడీపీల మధ్య సుహృద్భావ వాతవరణంలోనే మంత్రులు ఇద్దరూ రాజీనామాలు చేయడం, టీడీపీ మంత్రులతో సాన్నిహిత్యంగా మాట్లాడటం విశేషం. నిజానికి, టీడీపీతో పొత్తు కొనసాగుతుందా లేదా అనే స్పష్టత ఇంకా చంద్రబాబు ఇవ్వాల్సింది ఉంది కానీ, రాష్ట్ర స్థాయిలో భాజపా టీడీపీల మధ్య బంధం తెగినట్టుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే, కేంద్రంలో టీడీపీ మంత్రులు రాజీనామాలు ప్రకటించాక, రాష్ట్రంలో భాజపా మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. దీంతో భాజపా వైపు నుంచి కూడా తెగతెంపుల ప్రక్రియ మొదలైనట్టుగానే చూడాలి. రెండు పార్టీల మధ్య ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలోనే భాజపా మంత్రులు రాజీనామాలు చేశారు. ఇక, టీడీపీపై విమర్శలూ విరుచుకుపడటాలు అనేవి మున్ముందు ఉంటాయని అనుకోవచ్చు.