తెలుగు రాష్ట్రాల్లో జలీల్ ఖాన్ అంటే కొంతమంది గుర్తుపట్టకపోవచ్చు కానీ బీకాం ఫిజిక్స్ జలీల్ ఖాన్ అంటే మాత్రం గుర్తుపట్టని వారు ఉండరు. సోషల్ మీడియాలో ఆయన ఇచ్చిన ఒక వీడియోలో తనకు ఫిజిక్స్ అంటే ఇష్టం కాబట్టి తాను డిగ్రీలో బీకాం తీసుకున్నా అన్న వ్యాఖ్యలు అంతలా వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి ఆయన బీకాం ఫిజిక్స్ జలీల్ ఖాన్ అయిపోయాడు. అయితే త్వరలో ఈయనకు రాష్ట్ర మంత్రి పదవి రానుందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
రాష్ట్ర మంత్రివర్గాన్ని కొద్దిరోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తరించే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. భాజపా మంత్రుల రాజీనామాల ఆమోదంతో ఏర్పడిన రెండు ఖాళీల్ని కొత్తవారితో భర్తీ చేయక తప్పదని అంటున్నారు. అవి రెండూ వైద్య, ఆరోగ్యం, దేవాదాయం వంటి కీలక శాఖలే. ఎక్కువ రోజులు ఖాళీగా ఉంచే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం మంత్రివర్గంలో ముస్లిం మైనారిటీలకు ప్రాతినిధ్యం లేదు. కిందటి ఎన్నికల్లో భాజపాతో ఎన్నికల అవగాహన కుదుర్చుకున్న నేపథ్యంలో మైనారిటీలు పార్టీకి కాస్త దూరమయ్యారన్న భావనుంది. ఏడాది కాలంలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాల దృష్ట్యా ముస్లిం మైనారిటీల తో భర్తీ చేసే అవకాశముందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
వైకాపా నుంచి ఆ వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీలో చేరగా… తెదేపాకి చెందిన నేత ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబట్టి ఖాళీ అయిన ఆ రెండు మంత్రి పదవుల ని ఈ ముగ్గురిలో ఇద్దరితో భర్తీ చేస్తారని ప్రచారం ఊపందుకుంటోంది. ఈ లెక్కన ఆ ముగ్గురిలో ముందు వరుసలో ఉన్న జలీల్ ఖాన్ కి మంత్రి పదవి దక్కే అవకాశం మెండుగా ఉందని భావిస్తున్నారు. మొత్తానికి బీకాం ఫిజిక్స్ జలీల్ ఖాన్ కి మంత్రి పదవి యోగం ఉందా లేదా అనేది త్వరలోనే తేలనుంది