ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని తాజాగా తెరాస కూడా మద్దతు ఇస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ కవిత, ఇతర తెరాస ఎంపీలు కూడా ఏపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఓరకంగా ఇది మంచి పరిణామమే అని చెప్పొచ్చు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారంతా ఒక్కటే అనే సంకేతాలు జాతీయ స్థాయిలో ఇచ్చినట్టు అవుతుంది. కానీ, దీన్ని రాజకీయ కోణంలో ఆలోచిస్తే.. కేసీఆర్ ప్రతీ చర్య వెనక ఏదో ఒక ప్రయోజనం దాగి ఉంటుందీ, ఏదో ఒక వ్యూహం అమల్లో ఉంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉంది. తాజాగా ఆయన జాతీయ రాజకీయాలవైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఆ దిశగా ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని, మెల్లగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రత్యేక హోదాకి మద్దతు పలికారనే అభిప్రాయం ఒకటుంది..!
జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రెంట్ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సిద్ధమౌతున్నారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళ్లాలన్నదే కదా ఆయన ప్రధాన అజెండా. ఆంధ్రాలో టీడీపీ బలమైన పార్టీ, పైగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన అనుభవం సీఎం చంద్రబాబు నాయుడుకి ఉంది. దీంతో భవిష్యత్తులో థర్డ్ ఫ్రెంట్ కి ఆయన మద్దతుగానీ, సూచనలూ సలహాలు వంటి అవసరాలు ఏర్పడొచ్చు. అందుకే, తెరాసపై ఇప్పట్నుంచీ ఒక సానుకూల దృక్పథం ఉండాలంటే, ప్రస్తుతం టీడీపీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలన్న ముందస్తు వ్యూహంతోనే సానుకూల ప్రకటనలు చేస్తున్నారనీ అనుకోవచ్చు.
ఇక, రెండో కోణం.. హైదరాబాద్ తోపాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో సెటిలర్స్ ఉన్నారు. వారిని ఆకర్షించడం కూడా తెరాస ప్రకటన వెనక వ్యూహంగానూ చెప్పొచ్చు. ఆంధ్రాకి కేంద్రం అన్యాయం చేస్తోందన్న భావన సెటిలర్స్ లోనూ తీవ్రంగానే ఉంది. ఇలాంటి సమయంలో తెరాస ఏపీకి మద్దతు పలుకుతోందంటే, ఈ పార్టీ కూడా ఆంధ్రా ప్రయోజనాల కోసం ఆలోచిస్తోందనే అభిప్రాయం కొంతవరకూ ఏర్పడుతుంది. ఈ తరుణంలో మరో అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస-టీడీపీల మధ్య పొత్తు ఉండబోతోందనడానికి ఇవే సానుకూల సంకేతాలు అనేవారూ లేకపోలేదు. నిజానికి, కేసీఆర్ ఆ మధ్య అనంతపురం వెళ్లొచ్చిన దగ్గర్నుంచీ ఈ చర్చ జరుగుతూనే ఉంది. పైగా, చంద్రబాబు కూడా తెలంగాణలో టీడీపీ పొత్తు విషయమై ఎటూ తేల్చకపోవడం, ఎన్నికలు సమయంలో కచ్చితంగా పొత్తు పెట్టుకుంటామని కొంత సందిగ్ధత కొనసాగించడం కూడా తెరాసతో పొత్తుకే మొగ్గుతారేమో అనే అభిప్రాయలూ ఉన్నాయి. మొత్తానికి, ప్రత్యేక హోదాకి కేసీఆర్ మద్దతు వెనక ఈ రెండు కారణాలు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.