హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్ ఛైర్మన్, టీడీపీ నేత చలమలశెట్టి రామాంజనేయులు రెడ్డి సామాజికవర్గంపై ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, కాపులను రెడ్లు అణగదొక్కారన్నది వాస్తవమని, ఇది నిజం కాకపోతే తనను గోదావరి గట్టున ఉరితీయాలని అన్నారు. నాడు ముఖ్యమంత్రిగా, రాష్ట్రపతిగా చేసిన నీలం సంజీవరెడ్డి దగ్గరనుంచి కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి నేటి జగన్ రెడ్డి వరకు అందరూ కాపులను అణగదొక్కారని ఆరోపించారు. బ్రిటిష్ వారు కాపులను బీసీలో పెడితే, రాష్ట్రంలో కాపుల సంఖ్య అధికంగా ఉందని, వారి పిల్లలు అందరూ చదువుకుంటే తమను అధిగమిస్తారనే దురుద్దేశంతో బ్రహ్మానందరెడ్డి కుట్రచేసి ఓసీలోకి మార్చారని అన్నారు. వైఎస్ కాపులను బీసీలలో పెడతానని మ్యానిఫెస్టోలో పేర్కొని కూడా కాపులను పట్టించుకోలేదని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పారని, అలాగే చేేశారని గుర్తు చేశారు.
మరోవైపు తునిలో కాపుల హక్కుల సాధనకోసం ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ నెల 31న జరప తలబెట్టిన కాపుగర్జన సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్ నేత, జగన్ ముఖ్య అనుచరుడు భూమన కరుణాకరరెడ్డి ఇవాళ తునిలో ముద్రగడ పద్మనాభాన్ని కలుసుకుని కాపులు చేస్తున్న పోరాటానికి వైసీపీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.