“ఏమండీ, అప్పు తీసుకునేటప్పుడు పది కోట్లు కావాలి, ఇరవై ఐదు కోట్లు కావాలి అని చక్కగా తెలుగులో అడిగిమరీ తీసుకుంటారు. అదే తీర్చమని అడిగితే మాత్రం ఇంగ్లీషులొ సమాధానం చెబుతారు” – ఇదీ అత్తారింటికి దారేది సినిమాలో, త్రివిక్రం వ్రాసిన డైలాగు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీని చూస్తుంటే ఇదే డైలాగు గుర్తొస్తోంది చాలా మందికి, కానీ రివర్స్ గేరులో!!
విషయానికి వస్తే, ఇటీవల విజయసాయి రెడ్డి ఒక జాతీయ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో చాలా స్పష్టంగా, ఇంగ్లీషులో, “ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా కేవలం మోడీ కి మాత్రమే ఉందని తాము భావిస్తున్నామని” చెప్పుకొచ్చారు. ఇక్కడ తెలుగు మీడియాలో మాత్రం వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు జగనేనని, కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెట్టేది జగన్ పార్టీయేనని చెబుతున్నారు. పార్లమెంటులో ప్రత్యేక హోదాపై చర్చ జరిగేలా ఏ పార్టీ చేసినా అది రాష్ట్రానికి మేలే చేస్తుంది. కానీ ఎందుకని అవిశ్వాస తీర్మానం గురించి గానీ, కేంద్రం మెడలు వంచే సత్తా తమకి ఉందనే విషయం (తెలుగు మీడియాలో తెలుగులో వైకాపా నాయకులు చెబుతున్నట్టు) గురించి కానీ విజయసాయిరెడ్డిగారు కానీ ఇతర వైకాపా నాయకులు గానీ ఎందుకని జాతీయ మీడియాలో మాట్లాడటం లేదనేది ఇక్కడ ప్రశ్న.
ఒక్క విజయ సాయి రెడ్డే కాదు, జగన్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టున్నాడు. ఆయన కూడా జాతీయ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చేటపుడు, బిజెపి జతకట్టడానికి తమకి ఎటువంటి అభ్యంతరమూ లేదని* (కండిషన్స్ అప్లై: ప్రత్యేక హోదా ఇస్తే*) అని స్పష్టంగా బిజెపి అధినాయకత్వానికి చేరేలా ఇంగ్లీషు లో మాట్లాడతాడు. ఇక్కడ తెలుగు మీడియాలో మాత్రం కేంద్రం తో (మోడీ తో కాదు, ఇక్కడ కూడా) పోరాడుతోంది తామేనని జగన్, మరికొందరు వైకాపా నాయకులు ప్రకటిస్తారు. ఇక వైకాపా ద్వితీయ శ్రేణి నాయకత్వం కేంద్రం తోనూ, మోడీ తోనూ హోదా కోసం పోరాడుతోన్న ఏకైక నాయకుడూ జగనేనని ఛానెళ్ళ డిబేట్లలో గట్టిగా వాదిస్తారు.
అటు ఇంగ్లీషులో బిజెపి తో పొత్తుకి సద్దమని, అర్థం కావాల్సినవాళ్ళకి అర్థమయ్యేలా సంకేతాలిస్తూ, అర్థిస్తూ, ఇక్కడ తెలుగులో కేంద్రం పై అవిశ్వాసం పెట్టేది తామేనని, కేంద్రాన్ని ఇరుకునపెట్టేది, కేంద్రం తో పోరాడేది తామేనని బెదిరిస్తున్నట్టు చెబుతూ వైకాపా ఏం సాధించదలుచుకుంది. కేవలం తెలుగు ప్రజలని మభ్యపెట్టడానికి మాత్రమే ఇలాంటి స్ట్రాటజీలు ఉపయోగపడతాయి. రాజకీయ స్వప్రయోజనాలని మెరుగుపరుచుకోవడానికి ఇలాంటి స్ట్రాటజీలు చేస్తున్నారని ప్రజలకి అర్థమైనపుడు ఆ ప్రయోజనమూ దక్కకుండా పోతుంది.