ఈ సమీక్షకు రేటింగ్ లేదు.
ఈ సినిమా చూడకండి..మీకు ఊహల పల్లకీలోనే సదా విహరించాలని వుంటే.
ఈ సినిమా చూడకండి. సమాజంలో కింద స్థాయిలో వేళ్లూనుకున్న సమస్యలను చూడడం ఇష్టం లేకుంటే..
ఈ సినిమా చూడకండి..పాటలు, ఫైట్లు, అందమైన ఊహాలోకమే సినిమా అనే ఆలోచనే మీకు వుంటే..
అలా కాకుండా ఓ మంచి ప్రయత్నాన్ని చూడాలనుకుంటే, తెరపై నటులు కాకుండా, జీవితాలు, సజీవ పాత్రలు దర్శించాలనుకుంటే మాత్రం కర్తవ్యం సినిమాను చూడండి. తెరపై ఎవ్వరూ నటించకుండా, కళ్ల ముందు సజీవ జీవితాలు కదలాడుతుంటే చూడగల దమ్ము వుంటే మాత్రమే ఈ సినిమా చూడండి.
ఎప్పుడూ అమ్మాయిలు సన్నగా అరనవ్వు నవ్వే సినిమాలో, కండలు తిరిగిన హీరోల ఖలేజా చూపే సినిమాలో కాదు, జీవితాన్ని కెమేరాలో బంధించి, తెరపైకి రివ్వున వదలడాన్ని కూడా చూడడం కోసం చూడండి.
ఇంతలా చెబుతున్నానని ఇదేదో అద్భుతమైన సినిమా అనేసుకోవద్దు. ఇదో సాదా సీదా సినిమా. దర్శకుడి (గోపీనయనార్) స్టామినాకు అద్దం పట్టే సినిమా. ఒక్క చోట జరిగే ఒక్క సంఘటన ఆధారంగా రెండు గంటల సేపు ఏ మాత్రం ఉత్కంఠ సడలకుండా సినిమా చేసి ఒప్పించడం అంటే అంత సులువు కాదు. ఆ ఫీట్ ను చేసి చూపించాడు దర్శకుడు. ఓ సాదా సీదా బతుకుల్లో అనుకోని సంఘటన జరిగినపుడు నడిచే వ్యవహారాలను కళ్ల ముందు వుంచాడు.
అంతరిక్షంలోకి రాకెట్ లు పంపే స్థాయికి అభివృద్ధి చెందిన దేశంలో ఓ వంద అడుగుల గోతిలో పడిన ప్రాణిని బయటకు తీసే సత్తా లేదా? అని నిలదీసి ప్రశ్నించే సినిమా ఇది.
ఇంతకీ ఈ కర్తవ్యం కథేంటీ? ఓ సిన్సియల్ కలెక్టర్ మధువర్షిణి (నయనతార). ఓ ఊరిలో కొన్ని బడుగు జీవితాలు. అలాంటి జీవితాల్లో ఓ జంటకు పుట్టిన పాప, నీరు పడని బోరు బావిలో పడిపోయింది. ఆమెను బయటకు ప్రాణాలతో తీయాలన్న తపన ఆ కలెక్టర్ ది. అధికారుల నిర్లక్ష్యం, అందుబాటులో లేని సాంకేతికత, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఏదో ఒకటి చేసి పాపను బతికించాలనే ఆశ. ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది అన్నది కథ.
కర్తవ్యం సినిమా అచ్చమైన తమిళ రియలిస్టిక్ మూవీస్ మాదిరిగా ప్రారంభమవుతుంది. పెద్దగా ఆసక్తి కలిగించదు ఆరంభంలో. అయితే దర్శకుడు అత్యంత సహజంగా సన్నివేశాలను చూసి ముచ్చటేస్తుంది. అది కూడా రియలిస్టిక్ సినిమాలు నచ్చేవారికి మాత్రమే. మెలమెల్లగా సినిమాలోకి తీసుకెళ్తూ, మెయిన్ ప్లాట్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, ఇక అక్కడి నుంచి సినిమా ఓ స్థాయికి చేరుకుని, అక్కడి నుంచి చివరి వరకు సమాంతరంగా పయనిస్తుంది. ఎక్కడా ఒక్క మెట్టు కూడా కిందకు దిగదు.
నిజానికి సినిమా ఎత్తుగడలో సన్నివేశాలు కామన్ ఆడియన్స్ కు అనవసరం ఏమో అనిపిస్తుంది. కానీ బడుగు జీవితాల్లో వుండే సమస్యలే కాదు, అనుబంధాలు, పిల్లలతో పెనవేసుకునే ఆప్యాయతలు అన్నీ మెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, అదే సమయంలో జనం ఎదుర్కోనే నీటి సమస్యను బలంగా ప్రస్తావిస్తూనే,అసలు కథలోకి వెళ్తాడు దర్శకుడు గోపీ నయనార్. ఈ మొత్తం ప్రాసెస్ అంతా ఎక్కడా సినిమాటిక్ గా అనిపించదు. అసలు దర్శకుడు డైరక్షన్ చేసినట్లు అనిపించదు. కొన్ని జీవితాల మీదకు కెమేరా ఫోకస్ చేసి వదిలేసాడు అనిపిస్తుంది. పైగా దర్శకుడు సినిమా మొత్తం మీద హీరోయిన నయనతార మినహా మరే ఒక్క క్యారెక్టర్ కోసం కూడా పని గట్టుకుని నటులను ఎంపికచేసినట్లు అనిపించదు. చాలా కాజువల్ మొహాలు కనిపిస్తాయి. పట్నం నుంచి పల్లెకు వచ్చే జర్నలిస్టుల మొహాలు కూడా చాలా సాదా సీదాగా, అక్కడి జనాల్లో కలిసిపోయినట్లే వుంటాయి.
దర్శకుడి ఆలోచనాధోరణిని, అతగాడు సినిమా ఏ విధంగా ప్రెజెంట్ చేయాలనుకున్నాడు అనే విషయాన్ని,పూర్తిగా ఆవాహన, అవగాహన చేసుకుని, చెలరేగిపోయారు సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు కూడా. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ దర్శకుడి ఆలోచనను దాటి ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఈ సినిమాను ఇలా చూపించాలనుకుంటున్నాడు..అలాగే చూపించాలి అన్నట్లు వుంటుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం లేకపోతే, ఈ సినిమా గురించి మాట్లాడుకునే అవకాశమే వుండదు. సినిమా ఎమోషన్ ను పట్టి నిలబెట్టాడు అతగాడు. సినిమా టైటిల్ కార్డుల దగ్గర నుంచి శుభం కార్డు దాకా నేపథ్య సంగీతం ఓ మూడ్ లో సాగేలా చేయడంలో జిబ్రాన్ విజయం సాధించాడు.
సినిమాలో నయనతార నటన చూస్తే, ఆమె నిబద్దత తెలుస్తుంది. ఓ సీరియస్, సిన్సియర్ ఆఫీసర్ ఎలా వుంటుందో అలాగే వుంటుంది. మిగిలిన నటులు ఎవరో మనకు పరిచయాలు తక్కువ. అసలు నటులు అనే వాళ్ల సంఖ్య ఒక చేతి వేళ్లపై లెక్కపెట్టేంతగా, జనాలు లేదా జూనియర్ ఆర్టిస్ట్ లు అనే వాళ్లు వందల్లో వుంటారు. వాళ్లందరూ కూడా తిరుగులేని నటన ప్రదర్శించడం విశేషం.
ఫైనల్ జడ్జిమెంట్
ఇంత చెప్పిన తరువాత తీర్పు అంటూ చూడండి..వద్దు అని చెప్పడం సరి కాదు. ఒక్కటే మాట..మరోసారి రియలిస్టిక్ సినిమాను చూడగలిగిన వారు, తెరపై పెయిన్ ను చూసి ఓర్చుకోగలిగినవారు కర్తవ్యం సినిమాను చూడొచ్చు. మనకెందుకీ బాధలు, కష్టాలు, కన్నీళ్లు..మన నిత్య జీవిత కష్టాలు మనకు చాలవా? అనుకునేవారికి మన కమర్షియల్ సినిమాలు మనకున్నాయి.