ఈ ఘటన జరగడంతో మజ్లీస్ తో సహా అన్ని రాజకీయ పార్టీలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ ఆత్మహత్యపై రాజకీయ పార్టీలు అన్నీ వెంటనే స్పందించాయి. రోహిత్ మృతికి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ పరోక్షంగా కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నందున వారిరువురూ కూడా దీనిపై సంజాయిషీ ఇచ్చుకొన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న తెదేపా కూడా చాలా ఆచితూచి దీనిపై స్పందించింది. “ఉజ్వల భవిష్యత్ ఉన్న రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం మాకు చాలా బాధ కలిగిస్తోంది. అతని కుటుంబ సభ్యులకు మా పార్టీ తరపున సానుభూతి తెలియజేస్తున్నాను. విశ్వవిద్యాలయాలలో విద్యార్ధుల పట్ల వివక్ష చూపడం చాలా దురదృష్టకరం. రోహిత్ మృతి వివక్షకు నిదర్శనంగా కనబడుతోంది. దీనిపై విచారణ చేసేందుకు కేంద్రప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీ దీనికి కారణాలను, బాద్యులను గుర్తించుటుందని ఆశిస్తున్నాము. రోహిత్ మృతికి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము,” అని తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా ఇంచు మించు అదే విధంగా స్పందించారు.