నాగార్జున – వర్మ కాంబినేషన్ అంటేనే ఓ క్రేజ్! శివ కలయిక కదా. ఆ మాత్రం ఉంటుంది. వర్మ ఎన్ని ఫ్లాపుల్లో ఉన్నా- ఏదో ఓ రూపంలో ఈ సినిమాపై క్రేజ్ పెరగాల్సిందే. కాకపోతే.. వర్మపై జనాలకు పెద్దగా నమ్మకాల్లేవు. ఆఫీసర్ అనే టైటిల్ వింటుంటే… మలయాళ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసినట్టు ఫీల్ కలుగుతోంది. పైగా నాగార్జున లుక్‌లో కూడా కాస్త తేడా కనిపిస్తోంది. దాంతో ఈ సినిమాకి దక్కాల్సిన హైప్ ఇంకా రాలేదనే అనిపిస్తోంది. ఈ సంగతి అటు నాగార్జునకీ, ఇటు వర్మకీ బాగా అర్థమయ్యాయి. అందుకే.. `ఐ మిస్ యూ` అంటే `ఐ మిస్ యూ` అంటూ సోషల్ మీడియా సాక్షిగా మెసేజీలు పెట్టుకున్నారు… ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా.
అయితే సినిమా కొనేవాళ్లు అంత తెలివి తక్కువ వాళ్లు కాదుగా. అందుకే వాళ్లు కాస్త వేచి చూసే ధోరణిలో పడ్డారు. ఈ సినిమాకి సంబంధించిన టీజరో, ట్రైలరో వస్తే గానీ.. వర్మ ఏం తీసుంటాడు అనే విషయంపై ఓ క్లారిటీ రాదు. తిమ్మిని బమ్మి… బమ్మిని తిమ్మి చేడయంలో వర్మ స్పెషలిస్టు. అందుకే టీజర్, ట్రైలర్ల విషయంలో వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడటని తెలుస్తోంది. టీజర్లు కట్ చేయడంలో ఇండ్రస్ట్రీలో కొంతమంది స్పెషలిస్టులు ఉన్నారు. ఎప్పుడూ వాళ్ల వంక కన్నెత్తి చూడని వర్మ.. `ఆఫీసర్` టీజర్ విషయంలో మాత్రం వాళ్లపై ఆధారపడుతున్నాడని టాక్. ఈసారి ట్రైలర్లు, టీజర్లు వాళ్ల చేతిలో పెట్టాలని భావిస్తున్నాడట. నాగార్జున కూడా ఈ విషయంలో కాస్త పట్టుగా ఉన్నాడని తెలుస్తోంది. టీజర్, ట్రైలర్ బయటకు వస్తే తప్ప ఈ సినిమాలోని కంటెంట్ అర్థం కాదు. అక్కడ తేడా కొడితే బిజినెస్‌పై ప్రభావం చూపిస్తుంది. అందుకే.. హడావుడిగా టీజర్ విడుదల చేయొద్దని వర్మకి గట్టిగా చెప్పాడని సమాచారం. తన సినిమా ప్రమోషన్ విషయంలో కాస్త తొందర పడే వర్మ… `ఆఫీసర్` విషయంలో ఆచి తూచి అడుగు వేయడానికి కారణం అదే.