ఉత్తరప్రదేశ్, బీహార్ లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో పుల్పూర్, గోరఖ్ పూర్ లోక్ సభ స్థానాల్లో భాజపా ఓడిపోయింది. బీహార్ లో అరారియా స్థానంలో కూడా ఓటమి తప్పలేదు. గోరఖ్ పూర్ లో భాజపాపై ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ గెలుపొందారు. పుల్పూర్ నియోజక వర్గంలో ఎస్పీ అభ్యర్థి నాగేంద్రప్రతాప్ సింగ్ పటేల్ గెలుపొందారు. బీహార్ లోని అరారియా లోక్ సభ నియోజక వర్గాన్ని ఆర్జేడీ కైవసం చేసుకుంది. భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ సింగ్ పై 57 వేల ఓట్లకు పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ముఖ్యంగా గోరఖ్ పూర్ లో ఓటమి భాజపాకి గట్టి ఎదురుదెబ్బ. ఈ నియోజక వర్గం భాజపాకి కంచుకోట 1998 నుంచి వరుసగా 5 సార్లు యోగీ ఆదిత్యానాథ్ గెలుస్తూ వచ్చారు. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ స్థానానికి రాజీనామా చేశారు. అంతకుముందు, అంటే గోరఖ్ పూర్ కి యోగీ ఆదిత్యానాథ్ వచ్చే వరకూ ఈ స్థానంలో మహంత్ అవేద్యనాథ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 1989 నుంచీ దాదాపు తొమ్మిదేళ్లు ఆయనా గెలుస్తూ వచ్చారు. ఈ ఉప ఎన్నికను 2019కి రిహార్సల్ అని యోగీ ఆదిత్యనాథ్ మొదట్నుంచీ ప్రచారం చేస్తూ వచ్చారు.
వ్యక్తిగతంగా ఇది యోగీ ఆదిత్యానాథ్ ప్రతిష్టను ప్రభావితం చేసిన ఫలితం. ఎందుకంటే, యోగీ ఆదిత్యానాథ్ ని హిందుత్వానికి చిహ్నంగా చూపిస్తూ, దేశవ్యాప్తంగా భాజపా బాగా ప్రచారం చేసుకుంది. అంతేకాదు, 2019లో కొన్ని ప్రముఖ రాష్ట్రాల్లో ఆయన్నే ప్రచారానికి దించాలని భాజపా సిద్ధపడుతోంది. త్వరలోనే జరగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కూడా ఆయన రాబోతున్నట్టు కథనాలు వచ్చాయి. అన్నిటికీ మించి.. భాజపాకి తీవ్రమైన హెచ్చరిక చేసిన ఫలితమిది. పాతికేళ్లుగా ఉప్పూ నిప్పూ మాదిరిగా ఉండే సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీలు చేతులు కలపడం అనూహ్య పరిణామం.