రామ్చరణ్ ‘రంగస్థలం’పై యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కించపరిచే చర్యను ఉపసంహరించుకోకపోతే సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. అసలు వివరాలలోకి వెళితే… ‘రంగస్థలం’లోని మూడవ పాట ‘రంగమ్మా… మంగమ్మా…’ను ఇటీవల విడుదల చేశారు. అందులో ‘గొల్లభామ వచ్చీ… నా గోరు గిల్లుతుంటే’ అనే పదాలు వున్నాయి. వాటిపై రాములు యాదవ్ మండిపడ్డారు. ‘మంగమ్మా… మంగమ్మా… గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే’ అనడం యాదవ మహిళలను కించపరచడమే అని ఆయన పేర్కొన్నారు. చిత్రబృందం ఆయా పదాలను వాడటం సరికాదన్నారు. వెంటనే పాటలో పదాలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేని యెడల సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. యాదవుల డిమాండ్స్ పట్ల చిత్రబృందం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.