ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు సీఎం చంద్రబాబు ఏం చేయబోతున్నారు..? నరేంద్ర మోడీ సర్కారుపై ఎలా పోరాటం చేస్తారు..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం… యునైటెడ్ ఫ్రెంట్..! విశ్వసనీయ సమాచారం ప్రకారం 11 పార్టీతో యునైటెడ్ ఫ్రెంట్ ను చంద్రబాబు తెరమీదికి తీసుకొస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నేతలతో ఫోన్లో చర్చించినట్టు జాతీయ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. ఈ పార్టీలన్నింటితో కలిసి, మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఒక భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో, వచ్చే నెలలో ఈ ధర్నా ఉంటుందని తెలుస్తోంది.
గడచిన కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ పార్టీలకు చెందిన నేతలకి ఫోన్లు చేస్తూ బిజీబిజీగా గడిపారని సమాచారం. అఖిలేష్ యాదవ్ (ఎస్పీ), మమతా బెనర్జీ (టీఎంసీ), శరద్ పవార్ (ఎన్సీపీ), మాయావతి (బీయస్), నవీన్ పట్నాయక్ (బీజేడీ), ఫరూక్ అబ్దుల్లా (జేకేఎన్సీ), ఓమ్ ప్రకాష్ చౌతాలా (ఇండియన్ లోక్ దళ్), అసోమ్ గణ పరిషత్ (ఏజీపీ), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), ఎంకే స్టాలిన్ (డీఎంకే)… వీరందరితో చంద్రబాబు మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ యునైటెడ్ ఫ్రెట్ తొలి సమావేశం అమరావతిలో ఏప్రిల్ 7న జరుగుతుందని విశ్వసనీయ సమాచారం.
1996 నాటి రాజకీయ పరిస్థితులే మరోసారి జాతీయ స్థాయిలో తెరమీదికి వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అప్పట్లో 13 పార్టీలు కలిసి యునైటెడ్ ఫ్రెంట్ ఏర్పడి, భాజపాని సవాల్ చేసింది. ఆ సమయంలో కూడా టీడీపీ క్రియాశీల పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా మోడీ సర్కారు తీరుపై వ్యతిరేకత వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. తాజాగా యూపీ, అంతకుముందు రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాల్లో వరుసగా జరిగిన ఉప ఎన్నికల్లో మోడీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఒక వేదిక మీదికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు.