కల్యాణ్ రామ్ కెరీర్ ఎప్పుడూ నాలుగు అడుగులు ముందుకు.. ఒక అడుగు వెనక్కి అన్నట్టే సాగింది. కానీ ఆయనెప్పుడూ అధైర్య పడలేదు. తనదైన పరిధిలో కొత్తగా ఏదో ట్రై చేస్తూనే ఉన్నాడు. పటాస్‌తో తన ఎదురుచూపులు ఫలించాయి. ఆ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ దక్కింది. ఇజం నిరాశ పరిచినా… కల్యాణ్ రామ్ మాత్రం తన వంతు చేయాల్సింది చేశాడు. నటుడిగా ఇంకో మెట్టు ఎక్కాడు. ఇప్పుడు ఎం.ఎల్.ఏ గా ముస్తాబయ్యాడు. ఈ వారం ఎం.ఎల్.ఏ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్‌తో తెలుగు 360 చిట్ చాట్
* హలో ఎం.ఎల్.ఏ గారూ..
– హాయండీ..
* పోలీంగ్ డేట్ దగ్గర పడుతున్నట్టుంది…
– (నవ్వుతూ) అవునండీ.. ఈనెల 23న పోలింగ్… అదే రోజు రిజల్ట్ కూడా! అందుకే చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
* నిజంగా ఈ ఎం.ఎల్.ఏ… మంచి లక్షణాలున్న అబ్బాయేనా?
– టైటిల్లో ఏముందో.. సినిమాలో కూడా అదే ఉంటుంది. నా క్యారెక్టరైజేషన్ ని బట్టే టైటిల్ పెట్టారు. నిజంగా మంచోడినే. కానీ కొన్ని పొరపాట్లు చేస్తుంటాను. దాన్నుంచి పాఠాలు ఎలా నేర్చుకున్నాడు? పొరపాట్లు ఎలా సరిదిద్దుకున్నాడు? అనేదే ఎం.ఎల్.ఏ కథ.
* ఇదో పొలిటికల్ డ్రామా అనుకోవొచ్చా?
– పాలిటిక్స్ కూడా ఉంటుంది. అంతమాత్రాన కేవలం అదే ఉండదు. అదో పార్ట్ మాత్రమే. ఓ మంచి లవ్ స్టోరీతో సినిమా మొదలవుతుంది. అలా.. అలా.. పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. దాన్నీ చాలా వినోదాత్మకంగానే చెప్పాం.
* ట్రయిలర్లో రజనీకాంత్ లెవిల్లో డైలాగులు చెప్పారు..
– అది దర్శకుడి ఆలోచనే. సరదాగా ఉంటుందంటే అలా ప్రయత్నించాం. ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్ పూర్తిగా వేరే స్థాయిలో ఉంటుంది. ఇది వరకు నేనిలాంటి డైలాగులు చెప్పలేదు.
* ప్రస్తుత కార్పొరేట్ విద్యావ్యవస్థనీ టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది..?
– అవునండీ… `పిల్లలకు ఆస్తులిస్తే అవుంటేనే బతుకుతారు. అదే చదువిస్తే ఎలాగైనా బతుకుతారు” అనే డైలాగ్ ఈ సినిమాలో ఉంది. ట్రైలర్ లో కూడా చూసుంటారు. ఆ పాయింట్‌కీ ఈ కథకూ సంబంధం ఉంది. హీరో జర్నీ అక్కడి నుంచే మారుతుంది.
* ట్రైలర్లోనే కథ చెప్పేశారు..
– కథలో ఏముందో అదే ట్రయిలర్లో చూపించాం. ట్రైలర్లో ఏముందో సినిమాలోనూ అదే పాయింట్ ఉంటుంది. ట్రైలర్లో ఏదేదో చూపించి, ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించి వాళ్లని మోసం చేసే ఉద్దేశం లేదు.
* ఉపేంద్ర మాధవ్ కొత్త దర్శకుడు.. ఈ సబ్జెక్ట్‌ని ఎలా హ్యాండిల్ చేశాడు?
– తను మంచి రచయిత. ఓ రచయిత దర్శకుడు అయితే చాలా సౌలభ్యాలుంటాయి. అరపేజీ డైలాగుని కుదించి ఒక్క వాక్యంలోకి తీసుకొస్తారు. అంతే ఎఫెక్టీవ్‌గా ఉంటుందది. తను చాలా మంచి రైటర్. ఈ సబ్జెక్ట్‌ని బాగా డీల్ చేశాడు.
* ఇంతకీ రాజకీయాలపై మీ ఒపీనియన్ ఏంటి?
– నాకు రాజకీయాల గురించి అంతగా తెలీదు. వాటి గురించి మాట్లాడేవాళ్లు చాలామంది ఉన్నారు. ఏ విషయంపైనైనా మాట్లాడాలనుకుంటే, దానిపై అవగాహన పెంచుకొనే మాట్లాడతా.
* పోనీ… పేపర్లో రాజకీయాలపై వచ్చే వార్తలపై ఎలా స్పందిస్తారు?
– అందరిలానే చూసి.. మాట్లాడుకుంటాం. అదీ మాకున్న పరిధిలోనే.
* ఎన్టీఆర్‌ని కలసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు?
– మా దగ్గర సినిమాకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. తారక్ మ్యూజిక్ బాగా వింటాడు. స్పోర్ట్స్‌కి సంబంధించిన సంగతులూ మాట్లాడుకుంటాం.
* నిర్మాతగా మీ ప్రయాణం సాఫీగానే సాగుతోందా?
– చాలా హ్యాపీగా ఉన్నా. నా సంస్థ నుంచి వచ్చిన సినిమా చూసి `ఇదేంట్రా ఇంత చెత్తగా ఉంది` అని ఎవరూ అనుకోలేదు. ఏదో ట్రై చేశాడు, చేస్తున్నాడు అనే పేరైతే తెచ్చుకున్నా. నా కెరీర్లో సూపర్ డూపర్ హిట్లు లేకపోవొచ్చు. కానీ.. చెత్త సినిమా అయితే చేయలేదు.. చేయను.
* బయటి నిర్మాతతో పనిచేయాలనుకుంటున్నప్పుడు బడ్జెట్ అంశాలు ఆలోచిస్తారా?
– తప్పకుండా. ఎం.ఎల్.ఏ నాకున్న మార్కెట్‌కు లోబడే చేశాం. ఈ సినిమాకి జరుగుతున్న మార్కెట్ పట్ల.. పూర్తి సంతృప్తితో ఉన్నా.
* మీ సినిమాలకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది?
-మా ఇంట్లో నుంచే. వాళ్లకంటే గొప్ప విమర్శకులు ఎవరూ లేరు.
* మంచి సినిమా చేశా గానీ, జనాలు ఆదరించలేదన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా?
– లేదండీ. మన వంతు మన ప్రయత్నం చేస్తాం. రిజల్ట్ మాత్రం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. వాళ్లనెప్పుడూ తప్పుబట్టకూడదు.
* నా నువ్వే ఎలా ఉండబోతోంది?
– అదో.. ప్రేమకథ. నా కెరీర్లో ఇంత వరకూ పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంలో నటించలేదు. తప్పకుండా నా నువ్వే మీ అందరికీ షాక్‌నిస్తుంది.