‘ఛలో’తో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చేశాడు నాగశౌర్య. అదేం మామూలు హిట్టు కాదు. రూపాయి పెడితే మూడు రూపాయలు వచ్చాయి. దాంతో నాగశౌర్య క్రేజ్ పెరిగింది. ఇప్పుడు అదే తలనొప్పులు తీసుకొస్తోంది. నాగశౌర్య తన సొంత నిర్మాణ సంస్థపై ‘నర్తనశాల’ అనే చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు. రేపు ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. అయితే ఇది వరకే శౌర్య ఓసినిమా ఒప్పుకున్నాడు. కెమెరామెన్‌గా పనిచేసిన సాయి శ్రీరామ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావాల్సింది. కోన వెంకట్ ఈ చిత్రానికి నిర్మాత. అయితే ఈ సినిమా పక్కన పెట్టి ‘నర్తన శాల’కు శ్రీకారం చుడుతున్నాడు శౌర్య.
నిజానికి కోన వెంకట్ సినిమా ఈ పాటికి పట్టాలెక్కాల్సింది. దాన్ని కాదని తన సినిమాకి శ్రీకారం చుట్టడం కోనకి నచ్చలేదు. ఈ విషయంపై అటు శౌర్యకీ ఇటు కోనకూ మధ్య గ్యాప్ వచ్చింది. ఇప్పటికే శౌర్యకి రూ.25 లక్షల వరకూ అడ్వాన్స్ ఇచ్చాడు కోన. `ఛలో` పూర్తయిన వెంటనే మొదలవ్వాల్సిన ప్రాజెక్టు ఇప్పటి వరకూ పట్టాలెక్కకుండా.. ఈలోగా మరో ప్రాజెక్టుని సెట్ చేసి దాన్ని పట్టాలెక్కించడం వల్ల కోన హర్టయ్యాడు. ఈ విషయంపై ఎన్ని సంప్రదింపులు చేసినా శౌర్య నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని తెలిసింది. దాంతో.. కోన ఇప్పుడు శౌర్యకు నోటీసులు కూడా పంపాడని తెలుస్తోంది. ”నాకు ఈ కథ నచ్చలేదు.. కొన్ని మార్పులు చేర్పులూ చేయాలి.. అందుకోసం దర్శకుడికి కొంత సమయం ఇవ్వాలి” అని శౌర్య చెబుతున్నాడట. `ఆల్రెడీ లాక్ చేసిన స్క్రిప్టులో మార్పులేంటి` అని కోన అడుగుతున్నాడు. అక్కడే వ్యవహారం బెడసి కొట్టిందని సమాచారం. మరి ఈ నోటీసులు అందుకున్న శౌర్య ఎలా స్పందిస్తాడో చూడాలి.