ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. రేపో.. మాపో షూటింగ్ షురూ అవుతుంది. అయితే… ఈ సినిమాకి అనిరుధ్ నుంచి తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు త్రివిక్రమ్ సినిమా ‘అజ్ఞాతవాసి’కీ అనిరుధ్ సంగీతం అందించాడు. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అజ్ఞాతవాసి ఎఫెక్ట్ తన కొత్త సినిమాపై పడకుండా ఉండాలని.. అనిరుధ్‌ని పక్కన పెట్టి.. తమన్‌ని తీసుకున్నాడు త్రివిక్రమ్.
ఇక్కడి వరకూ బాగానే ఉంది. అనిరుధ్ కూడా ఇష్టపూర్వకంగానే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అయితే… ఇప్పుడు ఈ సినిమాకి అనిరుధ్ విలన్‌గా మారినట్టు సమాచారం. అదెలాగంటే.. ఈ సినిమా కథ అనిరుధ్ బయటకు లీక్ చేసేస్తున్నాడట. తనను కలిసినవాళ్లందరికీ, అడక్కపోయినా.. ఎన్టీఆర్ – త్రివిక్రమ్‌ల సినిమా పాయింటు ఇదీ.. అని పూస గుచ్చి మరీ చెబుతున్నాడట. దాంతో ఈ కథకు సంబంధించిన కీలక విషయాలు ముందే లీక్ అయిపోతున్నాయని తెలుస్తోంది. ఈ విషయం… త్రివిక్రమ్ వరకూ వెళ్లిందని సమాచారం. అనిరుధ్ ఇలా… విషయాలన్నీ బయటపెట్టేస్తే ఎలా అనే కంగారు పట్టుకుంది చిత్రబృందానికి. ఈ విషయమై అనిరుధ్‌కి త్రివిక్రమ్ మందలించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన విషయాలన్నీ అనిరుధ్ ద్వారానే వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ‘అనవసరంగా అనిరుధ్‌కు కథంతా చెప్పేశానే’ అంటూ త్రివిక్రమ్ తల పట్టుకుంటున్నాడట.