పల్లెటూరంటే..పచ్చని చెట్లు, పంట పొలాలు, గల గల పారే సెలయేర్లూ… మన తెలుగు సినిమాలన్నీ ఇలానే చూపించాయి. పల్లెటూరి నేపథ్యంలో సుకుమార్ ఓ సినిమా తీస్తాడనగానే.. ఈసారీ అదే పచ్చదనం వెండి తరపై ధారబోస్తాడనిపించింది. కానీ… ‘రంగస్థలం’ కథ మరోలా ఉంది. పల్లెటూర్లలో ఉండే `రా`నెస్.. ఈ ట్రైలర్లో కనిపించింది. అక్కడి రాజకీయం, కుళ్లు, కుతంత్రం కూడా దర్శన మిచ్చాయి. పాత్రలు. అవి పలికే మాటలు, వాళ్ల ఎమోషన్స్ చూస్తుంటే.. సుకుమార్ తప్పకుండా `పల్లెటూరి`కి అదర్ సైడ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడేమో అనిపిస్తోంది. 1980 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఇదీ మాస్ సినిమానే. కాకపోతే ఇప్పటి వరకూ చూసిన మాస్ సినిమాల లక్షణాలేం తెరపై కనిపించలేదు. ఆ విషయంలో సుకుమార్‌ని మెచ్చుకోవాలి. సాధారణంగా తమిళ సినిమాల్లో కనిపించే రానెస్ ఈ సినిమాలో చూపించి ఓ గొప్ప సాహసానికి పూనుకున్నాడు సుకుమార్. అన్నీ ఒకయెత్తయితే.. రామ్‌చరణ్ మేకోవర్ మరో ఎత్తు. దేవి ఆర్.ఆర్, రత్నవేలు కెమెరా పనితనం, నిర్మాణ విలువలు ఈ సినిమాని మరో స్థాయిలో చూపించడం ఖాయమనిపిస్తున్నాయి. మొత్తానికి రంగస్థలం ట్రైలర్ కొత్తగా ఉండి.. కోటి ఆశలు రేపింది. అంతిమ ఫలితం ఏంటన్నది ఈనెల 30న తేలిపోతుంది.