ప్రతి శుక్రవారం ఏదొ ఒక బొమ్మ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఆ మాటకు వస్తే ఒకటన్నమాటేమిటి? రెండు మూడు సినిమాలు కూడా వస్తుంటాయి. కొన్ని బొమ్మలు చూస్తే హమ్మ..అనిపిస్తుంది. మరి కొన్ని బొమ్మలు చూస్తే దిమ్మ దిరిగిపోతుంది. ఇంకొన్ని బొమ్మలు చూస్తే, ఇలా కాకుండా అలా చేసి వుంటే అని కూడా అనిపిస్తుంది. సాధారణంగా సమీక్షల్లో ఇలాంటివి అన్నీ ముచ్చటించుకోలేం. సమీక్షకు వున్న పరిథులు అలాంటివి. ఆ పరిథులు దాటి సినిమాను చూస్తే…అదే బొమ్మ బొరుసు..
ఈవారం బొమ్మ బొరుసులో చర్చించుకోబోయే సినిమా నిఖిల్ ‘కిర్రాక్ పార్టీ’
కిర్రాక్ పార్టీ కన్నడ సినిమా ను తెలుగులోకి తెచ్చుకున్న బాపతు. ఏదైనా వస్తువు కొనే ముందు అది మన ఇంట్లో వుందా లేదా అని చూసుకుంటాం. అలాగే ఓ సినిమా హక్కులు కొనేముందు, అలాంటి సినిమా మన దగ్గర వచ్చిందా? లేదా? అన్నది చూడాలి కదా? హ్యాపీడేస్ ప్లస్ ప్రేమమ్ అంటే కిర్రాక్ పార్టీ అనే విధంగా కథ వున్నపుడు ఎందుకు కొన్నట్లో?
సరే కొన్నారు, అప్పుడు మళ్లీ దానికి మళ్లీ అర్జున్ రెడ్డి అద్దకాలు ఎందుకు అద్దడమో?
సరే ఈ సంగతి అలా వుంచితే కిర్రాక్ పార్టీ లో నటీనటులు ఎవరు అని క్వశ్చను వేయండి. కామన్ ఆడియన్స్ నోట నిఖిల్ అన్న పేరు తప్ప మరో పేరు వస్తుందేమో? ట్రయ్ చేయండి.
శేఖర్ కమ్ముల అందరూ కొత్తవాళ్లతో చేస్తే నడుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ చిన్న హీరోతో చిన్న సినిమా చేస్తే నడుస్తుంది. అలా అని కొత్త డైరక్టర్ అందరూ కొత్త వాళ్లతో సినిమా అంటే ఎలాంటి రెస్పాన్స్ వుంటుంది. కిర్రాక్ పార్టీ చూస్తే, ప్రిన్సిపాల్ గా రావు రమేష్ ఎలా వుంటాడు? హీరో పక్కన ఫ్రెండ్స్ బ్యాచ్ లో వెన్నెల కిషోర్, సప్తగిరి ఇలా కొంతమంది యంగ్ కమెడియన్ లను ఊహించుకోండి. అప్పుడు సినిమా ఎలా వుండేదో ఆలోచించండి.
అక్కడంతా అలా తీసారు, ఇక్కడ కూడా ఇలాగే తీద్దాం అనే ఆలోచన ఎందుకు? మన ప్రేక్షకులు, మన హీరో, మన స్టామినా? ఇవన్నీ చూడాలి కదా? అర్జున్ రెడ్డి లో స్క్రీన్ ప్లే అటు ఇటు గెంతింది అంటే అక్కడ నడిచింది. ఆ జోనర్ వేరు, ఆ క్యారెక్టర్ వేరు. ఇక్కడ కూడా ద్వితీయార్థంలో అలా చేస్తాం అంటే జనాలకు ఇదేం స్క్రీన్ ప్లే అని అనిపించిందా? లేదా?
అవును, అసలు హీరో సెకండాఫ్ స్టార్ట్ కాగానే అందర్నీ అలా కొట్టేస్తూ వుంటాడు? ఎందుకు? అమ్మాయిలను కామెంట్ చేసినందుకా? తన హీరోయిన్ విడియోలు పాస్ ఆన్ చేసినందుకా? ఇంతకీ హీరోయిన్ హాస్టల్ కు వెళ్తే, అక్కడ అమ్మాయిల మధ్య సరదాలు, టీజింగ్ లు జరిగితే విడియో తీసింది ఎవరంటా? అది సర్క్యులేట్ చేసింది ఎవరంటా? రాత్రికి రాత్రి చనిపోతే, తండ్రికి శవం కన్నా ముందుగా వాట్సప్ లో విడియో వచ్చిందా ? అందుకని చనిపోయిన కూతుర్ని ద్వేషించాడా? అవును? ఇంతకీ ఆ డైరీలో హీరోయిన్ ఏం రాసింది?
అది కాదు, వున్నట్లుండి సెకెండ్ హీరోయిన్, హీరోను పాత హీరోయిన్ ఇంటికి తీసుకెళ్లి సాధించింది ఏమిటి? ఆఫై సెక్స్ వర్కర్ ఇంటికి సీన్ ను తరలించి చూపించింది ఏమిటి? ఇవన్నీ సినిమాకు ఏ మేరకు అవసరం?
మొత్తం హిమాలయాలు అంతా తిరగేస్తాడు కదా? హీరో. దేనికని? మొదటి హీరోయిన్ ను మరచిపోవాలా? వద్దా? అనా? రెండో హీరోయిన్ ను ప్రేమించాలా? వద్దా? అనా? అందుకోసం అంతలా తిరిగేసి, 10 నిమషాలకు పైగా జనాలను థియేటర్లో బోర్ కొట్టించాలా? ఇదంతా అర్జున్ రెడ్డి పైత్యం కాదు కదా? ఇలా సినిమాలో ట్రిమ్ చేయాల్సినవి చాలా వున్నాయి. కానీ అసలు సినిమాలో క్లియర్ విషయం లేదు. ఇవన్నీ ట్రిమ్ చేస్తే సినిమానే వుండదు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, సినిమా లైన్ తీసుకుని, కాస్త ఎక్సర్ సైజ్ చేసి, కొత్తగా రాసుకుని వుంటే, వేరుగా వుండేది. జిరాక్స్ కాపీ తీస్తే ఇలాగే వుంటుంది. ఎంత జిరాక్స్ అంటే గురువారం సాయకాలం పాటలో స్కూటర్ పై కూర్చుని హీరో తల ఊపుడుతో సహా.
కుర్రాళ్ల సినిమాలో సెక్స్ వర్కర్, ఆమెకు హీరోయిన్ సాయం చేయడం, ఆమెకు మళ్లీ హీరో సాయం చేసి మెప్పు పొందడం చూస్తే, గమ్యం సినిమాలో చివర్న హీరో చుట్టూ జరిగే సన్నివేశాలు కొన్ని గుర్తుకు రావడం లేదూ? చందు మొండేటి లాంటి రెండు హిట్ సినిమాల డైరక్టర్ , ఈ సినిమాలు ఫేస్ బుక్ అనే కొత్త బుక్ వచ్చిందటూ రాసిన డైలాగు వింటే, ఆ మధ్య వచ్చిన కేరింత సినిమా గుర్తు రాలేదూ? అసలు కుర్రాళ్లు అంటే కొత్తదనం, జోరు. జోష్. అలాంటది కుర్రాళ్ల కాలేజీ సినిమా అంటే ఎంత కొత్తగా వుండాలి. అంతే కానీ, డైరక్టర్, స్క్రీన్ ప్లే డైరక్టర్, డైలాగ్ డైరక్టర్ లు చదువుకున్న పాతకాలం రోజులను ఇప్పుడు కొత్తగా తెరపైకి తెస్తే, అవి కాస్తా కొత్తయిపోతాయా? చెప్పండి.
ఇలా ఎక్కడిక్కడ కొత్త దనం లేకుండా చేసుకుని, ఇప్పుడు సినిమాకు సమీక్షలు సరిగ్గా రాలేదు అనుకుని ఏం ప్రయోజనం?