నందమూరి కల్యాణ్ రామ్ కి సంబంధించిన సినిమా వేడుక అంటే… అతిథి కోసం వెదుక్కోవాల్సిన పనిలేదు. వేడుక ఏదైనా ఎన్టీఆర్ రావడం తథ్యం. గత కొన్నేళ్లుగా అన్నాదమ్ముల అనుబంధం సినిమా వేడుకల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఎం.ఎల్.ఏ వేడుకకు మాత్రం అది సాధ్యం కావడం లేదు. ఈరోజు హైదరాబాద్‌లో ఎం.ఎల్.ఏ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ రావడం లేదు. త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ ప్రత్యేకమైన `లుక్`లోకి మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి కార్యక్రమాలకు వస్తే.. ఆ లుక్ బయటపడిపోతుంది కదా? అందుకే ఎన్టీఆర్‌కి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఎన్టీఆర్ రావడం లేదు కాబట్టి.. నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉందనుకున్నారంతా. బాలయ్యని ఎం.ఎల్.ఏ వేడుకకు పిలుస్తారేమో అనుకున్నారు. కానీ.. కల్యాణ్ రామ్ మాత్రం బాలయ్య ని పిలిచే ధైర్యం చేయడం లేదు. ఎన్టీఆర్‌కీ బాలయ్యకూ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే అన్న సంగతి తెలిసిందే. తమ్ముడు ఫీలవుతాడేమో అన్న అనుమానంతో.. కల్యాణ్ రామ్ బాబాయ్‌కి ఆహ్వానం పంపలేదు. దాంతో ఈసారి కల్యాణ్ రామ్ వేడుక అటు బాలయ్య, ఇటు ఎన్టీఆర్ లేకుండానే జరగబోతోంది.