పార్లమెంటులో మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది..! అనుకున్నట్టుగానే ఈరోజు (మంగళవారం) కూడా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగలేదు. సభా కార్యకలాపాలు ముందుకు సాగలేదు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, కేంద్రంలోని భాజపా సర్కారు మోసం చేసిందంటూ టీడీపీ, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులను స్పీకర్ సుమిత్రా మహాజన్ చదివి వినిపించారు. అయితే, ఆ వెంటనే.. సభలో పరిస్థితి చర్చకు అనుకూలంగా లేదనీ, సభ ఆర్డర్ లో లేనందున చర్చ చేపట్టడం సాధ్యం కాదంటూ వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ రోజు కూడా తెరాస, అన్నాడీఎంకే ఎంపీలు స్పీకర్ పోడియం ముందుకు వెళ్లి నిరసన తెలపడం గమనార్హం.
సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యుల ఆందోళన మొదలైంది. దీంతో సభను కాసేపట్లో వాయిదా వేశారు. గంట తరువాత ప్రారంభమైన తరువాత కూడా సభలో పరిస్థితి ఏమాత్రమూ మార్పులేదు. ఈ గందరగోళం మధ్యనే ఇరాక్ లో నాలుగేళ్లుగా కిడ్నాప్ అయిన 39 మంది భారతీయులను ఐ.ఎస్. పొట్టన పెట్టుకోవడంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటన చేశారు. ఈ సందర్భంలో కూడా సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తరువాత, ఈ గందరగోళం మధ్యనే కొన్ని బిల్లులకు ఆమోదం తెలిపారు. ఆ తరువాత, అవిశ్వాసం అంశంపై స్పీకర్ స్పందిస్తూ… సభ సజావుగా లేనందువల్ల చర్చకు పెట్టలేకపోతున్నామని చెప్పి, బుధవారానికి సభను వాయిదా వేశారు.
అనంతరం, కేంద్రం తీరుపై టీడీపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాసానికి కేంద్రం భయపడుతోందనీ, రహస్య ఓటింగ్ పెడితే ప్రభుత్వం పడిపోతుందనే టెన్షన్ వారికి ఉందని ఆరోపించారు. ఈ తీర్మానం ఎదుర్కొనే ధైర్యం భాజపా సర్కారుకు లేదన్నారు. సుష్మా స్వరాజ్ మాట్లాడుతున్నప్పుడు ఆందోళన చేయవద్దంటూ అన్ని పార్టీల ఎంపీల దగ్గరకి భాజపా విప్ వెళ్లి కోరారనీ, అవిశ్వాస తీర్మానంపై కూడా అలా ఎందుకు వ్యవహరించడం లేదని టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. ఏదైతేనేం, ఇవాళ్ల కూడా మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ఆర్డర్ లో సభ లేదన్న కారణంతో భాజపా సర్కారు దాటేసింది. మళ్లీ రేపటి సభలో కూడా తీర్మానం పెడుతున్నట్టుగా ఇప్పటికే మరోసారి స్పీకర్ కు ఏపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. రేపు కూడా మరోసారి ఇలాంటి దృశ్యాలకే ఆస్కారం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం స్పీకర్ చేయడమే లేదు. రోజూ సభకు రావడం, సజావుగా సాగట్లేదని వెళ్లిపోవడం రొటీన్ వ్యవహారమైపోయింది. సభను సజావుగా నడపాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో స్పీకర్ తన ఛాంబర్ కి అన్ని పార్టీల వారినీ పిలిపించి, ,చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ, అది తమ బాధ్యత కాదన్నట్టుగా అధికార పార్టీ వ్యవహార శైలి కనిపిస్తోంది.