మరో మూడు రోజుల్లో ‘ఎం.ఎల్.ఏ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై కల్యాణ్ రామ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా ద్వారా ఓ కొత్త కల్యాణ్ రామ్‌ని చూడబోతున్నారని ఢంకా బనాయించి మరీ చెబుతున్నాడు. ఈరోజు హైదరాబాద్‌లో ఎం.ఎల్.ఏ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ కాస్త సుదీర్ఘంగానే స్పీచ్ ఇచ్చాడు. ప్రతీ మాటలోనూ ఈ సినిమాపై తనకున్న నమ్మకం తెలుస్తూనే ఉంది. ”నటన, డాన్స్, డైలాగులు, స్టైలింగ్… ఇలా ప్రతి విషయంలోనూ ఓ కొత్త కల్యాణ్ రామ్ కనిపిస్తాడు. సినిమాఎక్కడా బోర్ కొట్టదు. 2గంటల 9 నిమిషాల పాటు మిమ్మల్ని వినోదపరుస్తుంది” అని నమ్మకంగా చెప్పుకొచ్చాడు.
కల్యాణ్ రామ్ ఎప్పుడూ పూర్తి కథ వినలేదట. ఓ గంట మాత్రమే విని జడ్జ్ చేస్తాడట. ‘పటాస్’ కోసం తొలిసారి రెండు గంటల కథ విన్నాడట కల్యాణ్ రామ్. ఆ తరవాత.. అంత సేపు కథ విన్నది ఈ సినిమాకేటన ”ఉపేంద్ర ప్రతిభావంతుడైన దర్శకుడు. రెండుగంటల పాటు కథ చెప్పాడు. ప్రతీ సీన్ కళ్లకు కట్టినట్టు చూపించాడు. కానీ తనతో కాస్త టార్చర్ పడాలి. తాను అనుకున్న రైమింగ్, టైమింగ్ వచ్చేంత వరకూ వదిలి పెట్టడు. తనకు కావల్సినట్టుగా సంభాషణలు చెప్పించుకున్నాడు. అందుకే ట్రైలర్‌కి ఇంత స్పందన వస్తోంద”ని చెప్పుకొచ్చాడు కల్యాణ్ రామ్.