శాసనసభ, మండలి, పార్టీ సమన్వయ కమిటీ భేటీ, ప్రెస్ మీట్స్.. ఇలా అవకాశం ఉన్న ప్రతీచోటా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. ‘నవ్యాంధ్ర అంటే మీకు ఎందుకింత పగ..? రాష్ట్ర హక్కుల కోసం అడుగుతూ ఉంటే ఒక్కొక్కరినీ ఎగదోస్తూ దాడికి పంపిస్తారా..? పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది భాజపా కదా! మరి, ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ అడుగుతున్నా ఎందుకు ఇవ్వరు..? ఎందుకు స్పందించరు’ అంటూ అసెంబ్లీలో సీఎం స్పందించారు. నిజానికి, పార్లమెంటు ఉభయ సభలను సజావుగా నడిపించుకోలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందని భాజపా ఆలోచించడమే లేదు. మొత్తం వ్యవహారంపై భాజపా నేతల మొండి వైఖరి ఏంటనేది రోజురోజుకీ చాలా స్పష్టమౌతోంది. అదేంటంటే… విభజన హామీలు గురించి చర్చ జరగనీయకుండా చేయడం, చంద్రబాబు పాలనపై విమర్శలతో అసలు విషయాన్ని పక్కతోవ పట్టించడం..!
ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి వచ్చేసింది. టీడీపీని ఇకపై ప్రత్యర్థి పక్షంగా పరిగణించాలని ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో గతవారమే ఏపీ భాజపా నేతలంతా కలిసి నిర్ణయించారు. కాబట్టి, అధికార పక్షాన్ని ప్రశ్నించే, విమర్శించే అవకాశం వారికి ఉంది. కానీ, భాజపా నేతల విమర్శలు ఏ స్థాయిలో ఉన్నాయంటే… విభజన హామీల గురించి తప్ప, ఇతర అంశాలే మాట్లాడుతున్నారు. ‘ఇన్నాళ్లూ మీరు అడగటం అయిపోయింది, ఇకపై మేము అడిగిన అంశాలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సి ఉంటుంద’ని భాజపా ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. ‘మీ వంతు అయిపోయిందీ’ అంటే.. ఏమైందిపోయింది..? చంద్రబాబు అడుగుతున్నదేంటీ..? అడిగిన వాటికి సమాధానాలేవీ..? విభజన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు, ప్రత్యేక హోదా ఏదీ, విశాఖ రైల్వే జోన్ ఏదీ, వెనకబడిన జిల్లాలకు ఇస్తామన్న బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఏదీ, పరిశ్రమలకు రాయితీలు ఏవీ… ఈ ప్రశ్నలకు భాజపా సమాధానం ఏది..? ప్రతీసారీ ఎంపీ హరిబాబు చెప్పే… ఆ తొమ్మిది విద్యా సంస్థల గురించి తప్ప, ఏపీకి కేంద్రం చేసిన సాయమేదీ..? ‘కొన్ని అంశాలు పరిశీలనలో ఉన్నాయీ, కసరత్తు జరుగుతోందీ అని నిన్నమొన్నటి వరకూ అనేవారు. ఇప్పుడా మాటా లేదు..!
హామీలపై ఒక్కటంటే ఒక్క అంశానికీ స్పష్టమైన సమాధానం భాజపా ఇవ్వకపోగా, ఈ చర్చ జరగనీయకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే, చంద్రబాబుపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. ఏపీ సీఎంకి తెలిసిన రాజకీయ జిమ్మిక్కులు వేరెవ్వరికీ తెలియవనీ, రాజకీయ లబ్ధి కోసమే ఎన్డీయే నుంచి బయటకి వచ్చారనీ, రాజకీయ క్రీడలో ఆయన్ని ఎవ్వరూ బీట్ చేయలేరని రామ్ మాధవ్ తాజాగా విమర్శించారు. ఢిల్లీలో సెటిలైపోయిన ఇలాంటి ఆంధ్రా నేతలకు రాష్ట్రంలో ప్రజల మనోభావాలు ఏంటనేది ఎలా అర్థమౌతాయి..? వాళ్లకు తెలిసింది రాజకీయం మాత్రమే. ఇంకోపక్క, ప్రతిపక్ష వైకాపా కూడా చంద్రబాబుపైనే ఎదురుదాడి చేస్తోంది. పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ముఖ్యమంత్రిపై ఈ ముప్పెట దాడి వెనక భాజపా హస్తం ఉందో లేదో అనేది వేరే విషయం..! కానీ, విభజన హామీల అంశాన్ని తెరమీదికి రానీయకుండా, ఏపీకి ఇచ్చిన హామీలపై పదేపదే చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించనీయకుండా చేయడమే భాజపా వ్యూహంగా కనిపిస్తోంది. వారి దృష్టిలో ఏపీకి ఇచ్చిన హామీలు అనేది.. ముగిసిన అధ్యాయం..! ఇదే క్రమంలో ఆంధ్రా ప్రజల సెంటిమెంట్ వారికి అర్థం కాని అధ్యాయం కూడా..!