తృతీయ ఫ్రెంట్ అంటూ మొదలుపెట్టి, తరువాత ఫెడరల్ ఫ్రెంట్ అని పేరు మార్చారు..! కాంగ్రెసేతర, భాజపాయేతర మూడో కూటమి కడతా అంటూ కోల్ కతా వెళ్లొచ్చారు. త్వరలోనే యూపీ వెళ్తా, మహారాష్ట్రకి వెళ్తా అంటున్నారు. నాలుగైదు రాష్ట్రాల్లో పర్యటించాక ఢిల్లీ వేదికగా ఫ్రెంట్ ఏర్పాటు చేస్తాననీ, తన ఆలోచనల్ని జాతీయ మీడియాతో పంచుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమౌతున్నారు. అయితే, ఈ తరుణంలో శరద్ పవార్ కూడా ప్రాంతీయ పార్టీల కూటమి కట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆయన కూడా భాజపాను వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం మొదలుపెట్టారా.. అంటే, అవుననే అనాల్సి వస్తుంది. ఈ నెల 27న ఢిల్లీలోని తన నివాసంలో ఒక కీలక సమావేశం కోసం పలువురు నేతల్ని శరద్ పవార్ ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. మమతా బెనర్జీకి కూడా ఆహ్వానం పంపారు. భాజపాని వ్యతిరేకిస్తున్న పార్టీలను ఒకటి చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే కేసీఆర్ ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు అవకాశాలపై కచ్చితంగా ప్రభావం ఉంటుందనే చెప్పొచ్చు.
నిజానికి, కేసీఆర్ ఫెడరల్ ఫ్రెంట్ మోడల్ లోనే ఒక ప్రధానమైన లోపం ఉంది. అదేంటంటే.. కాంగ్రెస్ లేని భాజపా వ్యతిరేక ఫ్రెంట్ కావాలన్నది కేసీఆర్ ఆకాంక్ష. ఇక్కడే అసలు సమస్య ఉంది. మొన్ననే మమతా బెనర్జీతో భేటీ అయి వచ్చారు. కూటమి విషయంలో తొందరపడొద్దూ, ఆలోచిద్దామనే ఆమె కేసీఆర్ తో చెప్పారు. బెంగాల్ లో భాజపా ఎదుగుదలను ఎదుర్కోవడం మమతా బెనర్జీ ముందున్న ప్రధాన సవాల్. కాబట్టి, ఆమెకి జాతీయ స్థాయిలో ఒక మిత్రపక్షం అవసరమౌతుంది. అందుకే, రాజ్యసభ ఎన్నికల్లో తాజాగా ఆమె అనూహ్యంగా కాంగ్రెస్కు మద్దతు పలికారు. యూపీ పరిస్థితి అంతే. సమాజ్ వాదీ, బీఎస్పీలు భాజపాకి వ్యతిరేకంగా ఏమౌతున్నాయి. ఫుల్పూర్, గోరఖ్ పూర్ ఉప ఎన్నికల్లో భాజపాని ఎదుర్కొన్నాయి. అయితే, వీరు కాంగ్రెస్ ని ఎన్నికల ముందు కలుపుకుంటారా, తరువాత మద్దతు ఇస్తారా అనే చర్చే అక్కడ జరుగుతోంది. ఇక, శరత్ పవార్ విషయమే చూసుకుంటే.. ఆయన కూడా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతానికి మహారాష్ట్రలో భాజపాకి ఎన్సీపీ మద్దతు ఇస్తున్నట్టు కనిపించినా.. 2019 ఎన్నికలు వచ్చేసరికి తన స్నేహితుడైన కాంగ్రెస్ వైపే శరద్ పవార్ వెళ్తారనే అంచనా ఉంది. ఒడిశా విషయమే తీసుకుంటే.. సొంతంగా తాము అధికారంలోకి వస్తామని భాజపా అనేసరికి, అక్కడి బీజేడీ సహజంగానే మరో మిత్రపక్షం కోసం ఎదురుచూస్తోంది. ఇక, ఆంధ్రాలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. తమిళనాడులో మరో రకరమైన రాజకీయ వాతావరణం ఉంది.
ఇలా ప్రతీ రాష్ట్రానికీ వేర్వేరు రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. అవన్నీ కేసీఆర్ అనుకుంటున్న ఫెడరల్ ఫ్రెంట్ మోడల్ కి సరిపోతాయా అనే ప్రధానమైన చర్చ జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో శరద్ పవార్ ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. భాజపాయేతర పార్టీలను ఆయన ఏకం చేస్తా అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ను కూడా వ్యతిరేకించేవారికి మాత్రమే ప్రవేశం అనే రూల్ ని ఆయన పెట్టకపోవచ్చు. ఏరకంగా చూసుకున్నా, కేసీఆర్ కలలు కంటున్న కాంగ్రెస్ లేని భాజపా వ్యతిరేక కూటమికి అవకాశాలు కాస్త తక్కువగానే కనిపిస్తున్నాయన్నది విశ్లేషకుల మాట. ఈ సమీకరణాలపై కేసీఆర్ వ్యూహం ఎలా మారుతుందో వేచి చూడాలి.