రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్… మహాభారతం. ఎప్పటికైనా ఈ మహాభారత గాథని సినిమాగా తెరకెక్కిస్తానని రాజమౌళి ఎప్పటి నుంచో ఘంటాపథంగా చెబుతూనే వస్తున్నాడు. నిజానికి బాహుబలి తరవాత రాజమౌళి సినిమా అదేఅన్నట్టు ప్రచారం సాగింది. అయితే రాజమౌళి మాత్రం `నాకింకా అంత అనుభవం రాలేదు. నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.. కానీ ఎప్పటికైనా ఆ సినిమా తీస్తా` అని చెప్పేవాడు. ఇప్పుడు రాజమౌళి కంటే ముందే… అమీర్ ఖాన్ మహాభారత్ ప్రాజెక్ట్‌ని తన భుజాలపై వేసుకున్నాడు. రాజమౌళిలానే అమీర్కీ మహాభారత్ ని తీయాలన్నది కల. కాకపోతే ఆ సినిమాకి భారీ బడ్జెట్ అవుతుందని ఆలోచిస్తున్నాడంతే. అయితే ఆ బడ్జెట్‌ని భరించడానికి ముఖేష్ అంబానీ ముందుకొచ్చాడని బాలీవుడ్ సమాచారం. సుమారు రూ.1000 కోట్లతో ఈ సినిమాని నిర్మించడానికి ముఖేష్ సిద్ధమయ్యారని, ఈ విషయంపై అమీర్‌ఖాన్‌తోనూ ఆయన చర్చలు జరుపుతున్నారని, ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తారని, ప్రపంచంలోని సమారు అన్ని భాషల్లోనూ విడుదల చేస్తారని సమాచారం అందుతోంది.
మరోపక్క మలయాళంలోనూ మహాభారతం సినిమా రూపొందుతోంది. వాసుదేవన్ నయర్ రచించిన ‘రాందమూళం’ నవల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. మోహన్‌లాల్ భీముడి పాత్రలో నటిస్తున్నారు. కర్ణుడి పాత్ర కోసం అక్కినేని నాగార్జునను సంప్రదించారు. మరి అమీర్ మహాభారతంలో మెరిసే స్టార్లెవరు, దర్శకత్వ బాధ్యత ఎవరికి ఇస్తారు అనేది తేలాల్సివుంది. అయితే మహాభారతం విషయం రాజమౌళి కంటే.. అమీరే ముందున్నాడు. మరి రాజమౌళికి ఈ ఆలోచన ఎప్పుడొస్తుందో?