నందమూరి హీరోలిద్దరు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్‌కి పండగే. అలాంటి పండగ వాతావరణం థియేటర్లో తీసుకురావడానికి కల్యాణ్ రామ్ పెద్ద ప్లానే వేస్తున్నాడు. బాబాయ్ బాలకృష్ణతో కలసి ఒకే తెరపై కనిపించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. పవన్ సాధినేని చెప్పిన కథ.. కల్యాణ్ రామ్‌కి బాగా నచ్చింది. అయితే ఈ కథలో మరో హీరోకీ చోటుంది. ఆ పాత్రలో కనిపించే హీరో ఎవరన్నది త్వరలో చెబుతా అంటున్నాడు కల్యాణ్‌రామ్. కొన్ని వెబ్ సైట్లు… ఆ హీరో నందమూరి హరికృష్ణ అని చెబుతున్నాయి. నందమూరి హరికృష్ణతో కలసి నటిస్తే…. దానికి మల్టీస్టారర్ లుక్ ఎలా వస్తుంది? తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్నారు అంటారే తప్ప.. మల్టీస్టారర్ అవ్వదు. నిజానికి ఈ పాత్ర కోసం కల్యాణ్ రామ్ మదిలో మెదులుతున్న హీరో… బాలకృష్ణనే. బాబాయ్‌తో కలసి నటించాలని కల్యాణ్ రామ్‌కి ఎప్పటి నుంచో ఉంది. చిన్నప్పుడు ఓ సినిమాలో బాల నటుడిగా కనిపించాడు. ఆ తరవాత… కలిసి కనిపించే అవకాశం రాలేదు. ఈసారి ఎలాగైనా బాబాయ్‌తో ఓ సినిమా చేయాలని కల్యాణ్‌రామ్ ఫిక్సయినట్టు సమాచారం. పవన్సాధినేనితో బాలయ్యతో ఓ సిట్టింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు కల్యాణ్ రామ్. కథ వింటే బాబాయ్ తప్పకుండా ఒప్పుకుంటాడన్న ధీమా కల్యాణ్‌రామ్‌లో కనిపిస్తోంది. మరి.. బాలయ్య ఏం చెబుతాడో చూడాలి.